మోత్కూర్‌లో ‘యూత్ ఎంపవర్మెంట్ ఫెస్ట్–2026’
అక్టోబర్ 18న నిర్వహణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య..
ఆలేరు, అక్టోబర్ 5 (విజయక్రాంతి): యువతలో విద్య, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శకత్వం, నాయకత్వ లక్షణాలు, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పసలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘యూత్ ఎంపవర్మెంట్ ఫెస్ట్–2026’ను అక్టోబర్ 18న మోత్కూర్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా పసలా ఫౌండేషన్ గౌరవ ఫాదర్ జూలియన్, రీజినల్ మేనేజర్ పసలా విజయానంద్, పీఆర్ డైరెక్టర్, స్పోక్స్‌పర్సన్ చిలువేరు శంకర్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసి ఫెస్ట్‌కు ఆహ్వానించారు. అనంతరం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ‘యూత్ ఎంపవర్మెంట్ ఫెస్ట్–2026’ పోస్టర్‌ను బీర్ల అయిలయ్య ఆవిష్కరించారు. యువతకు అర్థవంతమైన అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో వారి పాత్రను మరింత బలోపేతం చేయడమే ఫెస్ట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు, కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొని తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకోనున్నారు.