నడిరోడ్డుపై బైక్‌తో యువకుడు స్టంట్లు
స్టంట్ చేసిన యువకుడిపై కేసు నమోదు, అరెస్ట్, బైక్ సీజ్
ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు:సిఐ చరమందరాజు
మఠంపల్లి సెప్టెంబర్ 05 (విజయ క్రాంతి): నడిరోడ్డుపై బైక్ పై స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్(Huzurnagar Circle Inspector) చరమందరాజు తెలిపారు. మఠంపల్లి మండల కేంద్రంలోని జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే ప్రధాన చౌరస్తాలో పర్వతం గోపీచంద్ (19) తండ్రి నాగరాజు అనే యువకుడు తన మామ నాగేశ్వరరావు తండ్రి పెద్ద సైదులు ద్విచక్ర వాహనం(Two wheeler)పై అత్యంత ప్రమాదకరంగా వీలింగ్‌లు చేస్తూ,ఒంటి చక్రం పై బైక్ నడుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. గతంలో కూడా ఇలాగే మఠంపల్లి మండల కేంద్రంలోని జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే ప్రధాన చౌరస్తాలో ఈ గోపీచంద్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై అత్యంత ప్రమాదకరంగా వీలింగ్‌లు చేస్తూ,ఒంటి చక్రం పై బైక్(Bike) నడుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు.
మెయిన్ సెంటర్‌లోనే అధిక వేగంతో బైక్(Bike) పై విన్యాసాలు చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు,ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు చేయడం అప్పట్లో తీవ్ర ఆందోళన కలిగించిందని స్థానికులు తెలిపారు.ఒక్క క్షణం అదుపు తప్పినా అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, రోడ్డుపై నడిచే పాదచారులు, విద్యార్థులు,వృద్ధులు, మహిళలకు ఇలాంటి చర్యలు ముప్పుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేవలం సరదా కోసం చేస్తున్న ఈ విన్యాసాలు పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే యువకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు వాహనాలను ఎలా నడుపుతున్నారో పర్యవేక్షించి బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. గతంలో ఈ పర్వతం గోపీచంద్ ని పట్టుకోవాలని మఠంపల్లి పోలీసులు ప్రయత్నించినా దొరకకుండా పారిపోయాడు. మళ్ళీ అదే బైక్ మీద మఠంపల్లి సెంటర్, జానపాడు రోడ్డులో ప్రమాదకర స్టంట్లు చేస్తూ మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ కు చిక్కాడు.వెంటనే స్పందించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆ యువకుడిని,ద్విచక్ర వాహనాన్ని మఠంపల్లి స్టేషన్ కి తరలించి అతనిపై మరియు అతనికి బైక్ ఇచ్చిన మామ పై కేసు నమోదు చేశారు.ఇటువంటి ప్రమాదకరమైన బైక్ స్టంట్ లు చేసే ఆ యువకుడుని పట్టుకోవటంతో మఠంపల్లి ఎస్సై,సిబ్బంది పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






