కార్యదర్శిపై ఫిర్యాదు

12-10-2026 | 08:40pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి అక్రమాలపై  మల్టీపర్పస్ వర్కర్లు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వేతనాల్లో కోత విధిస్తూ, తమను ఇబ్బందులకు గురిచేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై విచారణ చేపట్టాలని కోరుతూ వారు వినతిపత్రం అందించారు. నల్లూరి బాబు, నల్లూరి నర్సవ్వ, నల్లూరి పోసవ్వ, మెల్ల రవి, నల్లూరి సాయన్న అనే ఐదుగురం గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, రావాల్సిన వేతనాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా నగదు రూపంలో చెల్లిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా వేతనాల్లో కోత విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో ప్రతిరోజూ హాజరు నమోదు చేయకుండా కొన్ని రోజులకు మాత్రమే హాజరు వేస్తూ, వేతనాల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, పంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు