ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వ రెడ్డి
చేర్యాల,(విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వ రెడ్డి సూచించారు. పండుగ సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు ఇళ్లకు తాళాలు వేసి, పక్కింటి వారికి, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. దొంగతనాలు నివారించడానికి ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దుర్గామాత మండపాల వద్ద డీజేలు, లక్కీ డ్రాలు నిషేధమని, రాత్రి వేళల్లో నలుగురు కాపలా ఉండాలని స్పష్టం చేశారు.
రావణ దహనానికి పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు తెలపాలని కోరారు. దసరా రోజు మద్యం తాగి గొడవలు, డ్రైవింగ్ చేయరాదని, వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.