ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి

24-10-2026 | 10:05pm

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలన్నింటికీ ప్రభుత్వ ఆమోదిత ఇసుక మాత్రమే వినియోగించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, వివిధ శాఖల అభివృద్ధి పనులు, నిర్మాణాలలో ఇసుక వినియోగం(Sand Usage)పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి పనికి చట్ట ప్రకారం మాత్రమే ఇసుకను పొందాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే విధంగా ఇతర మార్గాల్లో ఇసుక సేకరించి వాడటాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని అన్నారు. నిర్మాణ పనులకు ఇసుకను పొందే మార్గాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఉంచాలని అన్నారు. నాసిరకం ఇసుక వాడటం వల్ల నిర్మాణాల్లో నాణ్యత లోపాలు తలెత్తుతాయని వివరించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కూడా పారదర్శకంగా ఇసుక పొందాలని చెప్పారు. ఆయా నిర్మాణ పనుల్లో ఇసుక కొరత తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, మైనింగ్ అధికారి తిరుపతి రావు, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖల ఈఈ లు సుభాష్, అనిల్, హౌసింగ్ పిడి శ్రీనివాస్, సిపిఓ గంగారెడ్డి, ఈడబ్ల్యుఐడిసి డిప్యూటీ ఈఈ గంగాధర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు