గంజాయి పట్టివేత

27-10-2026 | 11:27am

బాబా గార్డెన్ సమీపంలో అనుమానితుడి పట్టివేత.. కేసు నమోదు

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో బాబా గార్డెన్ సమీపంలో 130 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోధన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు సిబ్బందితో కలిసి బాబా గార్డెన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా 130 గ్రాముల గంజాయి లభ్యమైంది.

విచారణలో అతడి పేరు భాను భూషణ్ అని, రాకాసిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, నిందితుడి వద్ద గంజాయిని కొనుగోలు చేస్తున్నవారు ఎవరనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టి, సంబంధిత వ్యక్తులపై ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


గంజాయి విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు

బోధన్ పట్టణ పరిధిలో ఎవరైనా నిషేధిత గంజాయిని కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా సేవించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి విక్రయాలు, వినియోగం లేదా ఇతర మాదకద్రవ్యాల కార్యకలాపాలు గుర్తిస్తే 1908 నంబర్‌కు లేదా వాట్సాప్ నంబర్ 87126 71111కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని బోధన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

మరిన్ని వార్తలు