భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

31-10-2026 | 11:14pm

నాగన్‌పల్లిలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం

ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి: అధికారులు

బోధన్,(విజయక్రాంతి): భూగర్భ జలాలను పరిరక్షించడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే లక్ష్యంతో బోధన్ మండలంలోని నాగన్‌పల్లి గ్రామం(Naganpally Village)లో ఇంకుడు గుంతల నిర్మాణ(Soak Pit Construction) కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలమట్టాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఎల్‌నినో ప్రభావం(El Nino impact)తో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటూ వర్షపాతం తగ్గే అవకాశాలు, భూగర్భ జలమట్టాలు పడిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంచుకోవచ్చని వివరించారు.

నీటి వనరుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించి, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషోర్ కుమార్, ఎంపీఓ వేణుగోపాల్, గ్రామపంచాయతీ కార్యదర్శి అజారుద్దీన్, గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు