అమర పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

22-10-2026 | 09:45pm

ప్రమోద్ కుమార్ కుటుంబానికి నియామక ఉత్తర్వుల కాపీ అందజేత

నిజామాబాద్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వుల కాపీని గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు.

2025 సంవత్సరంలో విధి నిర్వహణలో అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ (బకిల్ నంబర్ 1923) కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యురాలు ప్రణితకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు.

ఈ క్రమంలో తాజాగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉత్తర్వుల కాపీని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ కుమార్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేసే త్యాగాలను ఎప్పటికీ మరువబోమని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు