ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాలు

22-10-2026 | 10:54pm

ఉదయించే భాస్కరుడిని ఎవరూ ఆపలేరు: ఈఎల్వీ భాస్కర్

శివన్నగూడెం ప్రాజెక్టు సాధన కోసం పోరాడుదాం

చౌటుప్పల్/గట్టుప్పల్: రాచకొండ దసరా ఉత్సవ సమితి(Rachakonda Dasara Festival Committee) ఆధ్వర్యంలో ఈఎల్వీ భాస్కర్ నేతృత్వంలో గురువారం గట్టుప్పల్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు శివన్నగూడెం ప్రాజెక్టు సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు చీరలు, సారెలు కాదు.. ప్రాజెక్టులు కావాలి

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు ఎంతో అవసరమని ఈఎల్వీ భాస్కర్ అన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని నల్లగొండ జిల్లాకు అందించడంలో ఎదురవుతున్న అడ్డంకులపై ప్రశ్నలు లేవనెత్తారు. మునుగోడు నియోజకవర్గం పాకిస్థాన్‌లో ఉందా? ఇక్కడి ప్రజలకు సాగునీరు అందించడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు.ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాలు కల్పించడం కంటే శాశ్వతంగా ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ముఖ్యమన్నారు.

 అడ్డంకులు వచ్చినా ప్రజల కోసం పోరాటం ఆగదు 

దసరా ఉత్సవాలకు పలువురు అతిథులను ఆహ్వానించామని, అయితే స్థానిక ఎమ్మెల్యే ఫోన్లు చేసి వారిని కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారని ఈఎల్వీ భాస్కర్ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు వచ్చినా రాకపోయినా ప్రజలు తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. “ఉదయించే భాస్కరుడిని ఎవరూ ఆపలేరు” అంటూ తన పోరాటం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటివరకు పాలించిన వారు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శిస్తూ, తమకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని అన్నారు.శివన్నగూడెం ప్రాజెక్టు సాధనతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ దసరా ఉత్సవాల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు