పోగొట్టుకున్న బంగారు చైన్ అప్పగించిన పోలీసులు
జిన్నారం: దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పోగొట్టుకున్న తులం బంగారు గొలుసును పోలీసులు బాధితునికి అప్పగించారు. బొల్లారం డివిజన్ పరిధిలోని వైయస్సార్ కాలనీలో ఈ నెల 20వ తేదీన అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర జరుగుతుండగా యువకులు రంగులు చల్లుకునే క్రమంలో ఓ యువకుడి బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాల ఫుటేజీని విచారించగా ఓ బాలుడికి బంగారు గొలుసు దొరికినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ సుధీర్ కుమార్ సేకరించిన బంగారు గొలుసును బాధితుడికి అప్పగించారు. దీంతో బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.