నిందితుడికి జీవిత ఖైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

25-09-2026 | 11:51am

చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు

సుల్తానాబాద్ లో ఘటనకు పాల్పడ్డ నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు

పెద్దపల్లి,(విజయక్రాంతి): చిన్నారిపై లైంగిక దాడి(child sexual assault case)కి పాల్పడి అనంతరం హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు(life imprisonment) విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు(POCSO Special Court) న్యాయమూర్తి స్వప్నరాణి గురువారం తీర్పు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రానికి చెందిన వినోద్ మాజి (28) ప్రస్తుతం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నివాసం ఉంటున్నాడు. 2024 జూన్ 13న సుల్తానాబాద్‌లోని ఓ రైస్‌మిల్లులో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై జూన్ 14న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ సమర్థవంతంగా వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు వినోద్ మాజికి జీవిత ఖైదు విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారి శ్రీనివాస్, లైజన్ అధికారి కోటేష్‌లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు