అంతర్గాం అభివృద్ధిపై బీఆర్ఎస్ సమరశంఖం

02-11-2026 | 03:57pm

పెండింగ్ పనుల సాధనకు భారీ నిరసన దీక్ష హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు

రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని,(విజయక్రాంతి): అంతర్గాం మండలం(Antargaon Mandal)లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల(Pending Development Works)ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ నిరసన దీక్ష చేపట్టారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్(Former MLA Korukanti Chander) దీక్షను ప్రారంభించి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతర్గాం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, గ్రామాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని చందర్ పేర్కొన్నారు. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండుమూడేళ్లుగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.

పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలి

మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరి వంతెన నిర్మాణం, పెద్దంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఖుర్జీ భూముల పట్టాల పంపిణీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వంటి కీలక పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. గతంలో మంజూరు చేయించిన ఈ పనులను ప్రారంభించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అంతర్గాం నుంచి మంచిర్యాలకు గోదావరి వంతెన నిర్మాణం చేపట్టాలని, పెద్దంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని, ఖుర్జీ భూముల పట్టాలను రైతులకు అందజేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఈ నిరసన దీక్షలో నడిపెల్లి మురళీధర్ రావు, మూల విజయ రెడ్డి, కౌశిక హరి, కొంకటి లక్ష్మీనారాయణ, హరీష్ రెడ్డి, మేకల సమ్మయ్య యాదవ్, మారుతితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు