మహిళకు హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ శిక్షణ
కొహెడ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా సాధికారత కల్పించి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే లక్ష్యంతో హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీపై(Handmade Jewelry Training) నైపుణ్య శిక్షణ తరగతులను అడిషనల్ DRDO సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (EDII)(Entrepreneurship Development Institute of India) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఎదిగి తమ కుటుంబాలకు అదనపు ఆదాయ వనరుగా నిలవాలని ఆకాంక్షించారు. శిక్షణలో చురుకుగా పాల్గొని, భవిష్యత్తులో ఉపాధి స్వయం ఉపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీకి మహిళా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లో 25 మంది మహిళలను ఎంపిక చేయడం జరిగిందని.. 22 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీ తో మహిళలు తమ ఇంటి నుంచే చిన్న స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించి ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు.
'నైపుణ్యం స్వయం ఉపాధికి బాట.. మహిళా సాధికారతకు పునాది' అనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. (EDII) సంస్థ ప్రాజెక్టు అధికారి ఎడ్మండ్ భూపతి, ఏపీఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.