పేదల పక్షపాతి కాకా వెంకటస్వామి

05-10-2026 | 04:21pm

మంథనిలో కాక జయంతి వేడుకల్లో మంథని కాంగ్రెస్ నేతలు

మంథని,(విజయక్రాంతి): పేదల పక్షాన నిలిచి, కార్మికులు, తెలంగాణ కోసం విశేషంగా పోరాడిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి(Former Union Minister Kaka Gaddam Venkataswamy) జయంతి సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అయిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి పేదల కోసం పోరాడిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు భూస్వాములు ప్రయత్నించిన సమయంలో పేదల తరఫున పోరాడి వారికి అండగా నిలిచినందుకు ఆయనకు ‘గుడిసెల వెంకటస్వామి’ అనే పేరు వచ్చిందని గుర్తుచేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బుల్లెట్ గాయాలపాలైన కాకా వెంకటస్వామి, మలి తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, పేదల హక్కులు, ఎఫ్‌సీఐ పునరుద్ధరణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

స్వర్గీయ శ్రీపాదరావుతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కాకా వెంకటస్వామి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయ సాధనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శ్రీను బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మంథని ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ మార్కెట్ చైర్మన్ అజీమ్ ఖాన్, మాజీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు