న్యాయం కోసం బాధితుల ఆవేదన

27-10-2026 | 04:58pm
  1. రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. రూ.39 లక్షలకే దక్కించుకునే యత్నం
  2. అగ్రిమెంట్, బ్యాంకు బిడ్డింగ్‌పై విచారణ జరపాలని బండం చంద్రశేఖర్ దంపతుల విజ్ఞప్తి

మంథని, అక్టోబర్ 27(విజయ క్రాంతి): కష్టపడి నిర్మించుకున్న ఇంటిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మంథనికి చెందిన బండం చంద్రశేఖర్, సుప్రియ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్(Manthani Division Media Press Club) కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంటి విలువ రూ.85 లక్షలుగా పేర్కొంటూ అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ, మరోవైపు బ్యాంకు వేలంలో రూ.39 లక్షలకే దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఈ వ్యవహారంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు కోరారు. 2015–2017 మధ్య సోలార్ కంపెనీలో పనిచేసిన సమయంలో కార్మికుల పీఎఫ్‌ వివాదంతో తనపై కేసు నమోదైందని తెలిపారు. పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో రూ.5 లక్షలు చెల్లించినని అయినా కేసు ఉపసంహరించుకోలేదన్నారు. తర్వాత పోలీసులు కేసును కొట్టివేసినట్లు తెలిపారు.

2021లో ఇంటి స్థలం కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు. ఇంటిపై తీసుకున్న రుణానికి ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఇంటిని సీజ్ చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి విలువ రూ.85 లక్షలుగా పేర్కొంటూ, రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు చూపిస్తూ అగ్రిమెంట్ రాయించుకున్నారని వారు తెలిపారు.

అయితే తనకు ఎలాంటి అడ్వాన్స్ అందలేదని, మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించలేదని వాపోయారు. ఆకుల కిరణ్ తనను బెదిరించినట్లు కూడా ఆరోపించారు. తనకు నోటీసులు ఇవ్వకుండానే ఆకుల కిరణ్ తన తమ్ముడు ఆకుల సంజీవ్ పేరుతో ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.39 లక్షలకు ఇంటిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న చెల్లింపులు జరిగాయా... బ్యాంకు వేలం నిబంధనల ప్రకారం సాగుతోందా... బాధితుడికి నోటీసులు అందాయా...అనే అంశాలపై విచారణ జరపాలని కోరారు.

తన సమస్యను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని చంద్రశేఖర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు