పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
తొమ్మిది మంది పేకాట రాయుళ్ల పట్టివేత
రూ.34,110 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం
గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్, గోదావరిఖని టూ టౌన్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకోగా, వారి వద్ద నుంచి రూ.34,110 నగదు, 8 సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారం అందడంతో గురువారం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్, గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకోటి నరేష్, బి.శ్రీనివాస్, జి.లింగయ్య, పి.రాజయ్య, ఎస్.కనుకయ్య, పి.సాది, ఎస్.నాగరాజు, పి.నాగరాజు, సీహెచ్.రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు పేకముక్కలు, నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జూదంపై పోలీసుల నిఘా
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.