రూ.13 కోట్ల ధాన్యం బకాయిల ఆరోపణలు
- 2021–22 బకాయిలపై సమగ్ర విచారణ జరిపించాలి
- బాయిల్డ్ రైస్ మిల్లు కాకున్నా వేసంగి ధాన్యం కేటాయింపులు ఎలా చేశారు
- విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు బాధ్యులు కావాలి
మంథని, అక్టోబర్ 13(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని మంథని మున్సిపల్ పరిధిలోని గంగపూరి గ్రామానికి చెందిన పవనసుతా రైస్ మిల్లు(Pavanasuta Rice Mill) యజమాని రావికంటి పవన్ కుమార్‌కు సంబంధించిన మిల్లుపై ప్రభుత్వ ధాన్యం బకాయిల విషయంలో పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
2021–22 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ధాన్యం బకాయిలు సుమారు రూ.13 కోట్ల మేర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ధాన్యం కేటాయింపులపై అనుమానాలు...?
బాయిల్డ్ రైస్ తయారీకి అనువుగా లేని మిల్లుకు వేసంగి ధాన్యం ఎలా కేటాయించారనే ప్రశ్నలు ప్రజలకు తలెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం కేటాయించారా...మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎక్కడికి వెళ్లింది. సూరయ్యపల్లిలోని శ్రీలక్ష్మీ రైస్ మిల్లుకు పవనసుతా రైస్ మిల్లుకు సంబంధించిన ధాన్యం ఎలా చేరింది...అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అధికారుల పాత్రపైనా విచారణ జరపాలి
ఈ వ్యవహారంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్ పాత్రపైనా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్ వివరాలు, ప్రభుత్వానికి బియ్యం అప్పగించిన లెక్కలు, బకాయిల వసూళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ప్రజాధనాన్ని రికవరీ చేయాలి
ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యం లేదా బియ్యం బకాయిలు ఉన్నట్లయితే వాటిని నిబంధనల ప్రకారం వసూలు చేయాలని, ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అవసరమైతే మిల్లుల రికార్డులు, ధాన్యం రవాణా వివరాలు, నిల్వల లెక్కలను తనిఖీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ ధాన్యం వ్యవహారంలో ప్రజాధనానికి నష్టం జరిగిందా... జరిగితే దానికి బాధ్యులెవరు. రూ.13 కోట్లుగా చెబుతున్న బకాయిల వాస్తవ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు అధికారుల విచారణతోనే సమాధానం లభించనుంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.