చరిత్ర సంస్కృతుల అన్వేషణలో పెద్దపల్లి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు

21-09-2026 | 08:52pm

గంధారి కిల్లా, జోడేఘాట్‌ సందర్శనతో ప్రత్యక్ష పరిశీలన ద్వారా విషయ పరిజ్ఞానం పెంపు

పెద్దపల్లి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సాంఘిక శాస్త్రాన్ని పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా చారిత్రక ప్రదేశాలు, సంస్కృతి, సమాజం, భౌగోళిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా మరింత లోతైన అవగాహన పొందవచ్చని పెద్దపల్లి జిల్లా సోషల్ స్టడీస్ ఫోరం(Social Studies Forum) ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ఞాన విహార యాత్ర నిరూపించింది.

సెప్టెంబర్ 20న నిర్వహించిన ఈ యాత్రలో పెద్దపల్లి జిల్లాకు చెందిన సుమారు 50 మంది మహిళా, పురుష సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని గంధారి కిల్లా, గంధారి మైసమ్మ ఆలయం, భైరవుడు, పది తలల నాగశేషు తదితర చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఉపాధ్యాయులు సందర్శించారు. ఆయా ప్రాంతాల చరిత్ర, స్థానిక సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, భౌగోళిక ప్రత్యేకతలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

అనంతరం జోడేఘాట్‌లోని కొమరం భీమ్ స్మృతి స్థలి, ఆయన మరణించిన ప్రదేశం, గిరిజన మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలో ప్రదర్శించిన గోండు, ఆదివాసీ సమాజాల సంప్రదాయ పరికరాలు, జీవన విధానం, సంస్కృతి, చారిత్రక అంశాలను పరిశీలించి పలు విషయాలను తెలుసుకున్నారు.

పుస్తక జ్ఞానానికి ప్రత్యక్ష అనుభవం తోడైతే విద్యార్థులకు మరింత అర్థవంతమైన బోధన అందించవచ్చని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి విజ్ఞాన యాత్రలు ఉపాధ్యాయుల విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో సాంఘిక శాస్త్రంపై ఆసక్తి, పరిశోధనా దృక్పథం, చరిత్ర–సంస్కృతిపై గౌరవాన్ని పెంచుతాయని తెలిపారు.

యాత్ర విజయవంతం కావడంలో జిల్లా అధ్యక్షుడు మారా రమేశ్, ప్రధాన కార్యదర్శి లింగం శ్రీనివాస్, కోశాధికారి ముద్రబోయిన కుమార్ స్వామి, రాష్ట్ర బాధ్యుడు గడ్డం రాజనర్సు, జిల్లా బాధ్యుడు కొండం శ్రీనివాస్ రెడ్డితో పాటు మండల, జిల్లా బాధ్యులు వనపర్తి అంజయ్య, సి.హెచ్. పోచయ్య, మూలా శ్రీనివాస్, కుమారస్వామి, యేసు, రాజమల్లు, కిషన్ రెడ్డి, దూడం సురేష్, రసూల్, సీమ హఫీజ్, స్వరూప, పద్మ తదితరులు కీలకంగా సహకరించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించి ఉపాధ్యాయుల జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మరింత నాణ్యమైన, అనుభవాత్మక బోధన అందిస్తామని ఫోరం బాధ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు