సర్పంచ్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన

13-10-2026 | 10:50pm

- చిన్న మూల్కనూరులో ఉద్రిక్తత

చిగురుమామిడి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్(Chinna Mulkanoor) గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఈనెల 6న కత్తెరమల్ల రమేష్(31) అనే ప్రైవేట్ ఎలక్ట్రిషన్ స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే రమేష్ ను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అనంతరం అక్కడనుండి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్ మృతికి గ్రామ సర్పంచ్ సాంబారి భారతమ్మ-కొమురయ్య కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, మాల సంఘం నాయకులు సర్పంచ్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సర్పంచ్ చెప్పడంతోనే స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తూ రమేష్ విద్యుత్ షాక్ కు గురయ్యాడని, మెరుగైన చికిత్స చేయిస్తామంటూ రమేష్ ను సర్పంచ్ పట్టించుకోలేదన్నారు.

రమేష్ ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేస్తానని చెప్పి గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేశారని మండిపడ్డారు. రమేష్ మృతికి సర్పంచ్ నిర్లక్ష్యమే కారణమని, కుటుంబానికి న్యాయం చేసి, రమేష్ పేరిట 50 లక్షల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకొని సర్పంచ్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు నిర్వహించారు. కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు