ఈరోజే నిమజ్జనం.. ఇప్పుడే పనులు
సిరిసిల్లలో ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు
ముందస్తు చర్యలు మరిచిన అధికారులు
రాజన్నసిరిసిల్ల(విజయక్రాంతి): వినాయక నిమజ్జనం(vinayaka immersion) సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన మున్సిపల్ అధికారులు నిమజ్జనం రోజే రోడ్డు పనులు, మరమ్మతులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమజ్జనం కోసం భారీగా ప్రజలు, వాహనాలు తరలివచ్చే సమయంలో రహదారి పక్కన మట్టి పోసి పనులు చేపట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతంలో నిర్మాణ పనులు, మట్టి గుట్టలు, వాహనాల రాకపోకలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిమజ్జనం తేదీ ముందే తెలిసినా పనులను ముందుగా పూర్తి చేయకుండా చివరి నిమిషంలో హడావుడిగా చేపట్టడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిమజ్జనం రోజే గుర్తొచ్చాయా పనులు
అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పండుగల సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని, ఇకనైనా అధికారులు స్పందించి నిమజ్జన మార్గాల్లో రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.