అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్
మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం అందించండి.. కుటుంబ సభ్యుల వేడుకోలు.
కోనరావుపేట, అక్టోబర్ 22 (విజయక్రాంతి):గ్రామంలోని వందలాది మంది కూలీలకు ఉపాధి కల్పించి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు కృషి చేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ స్వప్న(Employment Guarantee Field Assistant Swapna) నేడు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని ఆమె కుటుంబ సభ్యులు దాతలను వేడుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పులి స్వప్న గత పదేళ్లుగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ గ్రామంలోని వందలాది మంది కూలీలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగా ఆమెకు గర్భసంచి ఆపరేషన్ చేయించగా, ఆపరేషన్ అనంతరం కొంతకాలం ఆరోగ్యం బాగానే ఉంది.
కానీ గత మూడు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు.ఇప్పటికే వైద్యం కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేసి చికిత్స అందించారు.అయినప్పటికీ, స్వప్న ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడకపోవడంతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్వప్నకు భర్త రాజుతో పాటు నక్షత్ర, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కుటుంబానికి అండగా నిలిచిన స్వప్న అనారోగ్యం పాలవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
దాతలు మానవత్వంతో ఆదుకోవాలి.
గతంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరించిన స్వప్నకు ఇప్పుడు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.స్వప్నకు ఆర్థిక సాయం చేయదలచిన వారు ఈ ఫోన్‌పే నంబర్‌కు తమకు చేతనైనంత సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
ఫోన్‌పే నంబర్: 8978398425