గ్రామీణ మార్కెట్ నిరూపయోగం, ప్రజాధనం వృధా
చందుర్తి, అక్టోబర్ 29,(విజయక్రాంతి) : చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామానికి(Lingampeta Village) దూరంలో నిర్మించిన గ్రామీణ మార్కెట్(Rural market) నిరూపయోగంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన గ్రామీణ మార్కెట్ సరైన వసతులు , నిర్వహణ లేక,పిచ్చి మొక్కలతో ప్రజలకు అందుబాటులో లేక నిరుపయోగంగా మారింది.
ఊరికి దూరంగా దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో నిర్మించిన గ్రామీణ మార్కెటు ఇందుకు ప్రధాన ఉదాహరణగా కన్పిస్తుంది. గ్రామానికి కిలోమీటరు దూరంలో, ఊరికి అవతల ఈ మార్కెట్లను నిర్మించడం వల్ల రైతులు, కొనుగోలుదారులు అక్కడికి వెళ్లడానికి నిరుత్సాహం చూపుతున్నారు.ప్రారంభోత్సవాలకు నోచుకున్న ఈ మార్కెట్ దాదాపుగా రెండు సంవత్సరాలుగా అధికారుల పర్యవేక్షణ కొరవడి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి, రైతులకు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనుకూల వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ మార్కెట్లను నిర్మిస్తుంది. అయితే, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను,
స్థానిక పరిస్థితులను అంచనా వేయకుండా ,సరైన ప్రణాళిక బద్ధమైన ప్లానింగ్ లేకుండా లక్షలు వెచ్చించి నిర్మించడం వల్ల ఈ నిధులన్నీ నీళ్లపాలవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరూపయోగంగా పడి ఉన్న ఈ మార్కెట్ ను ఉపయోగంలోకి తీసుకు రావాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.