వైభవంగా వెంకన్న రథోత్సవం

27-10-2026 | 03:53pm
  1. గోవింద నామస్మరణతో మార్మోగిన లింగన్నపేట
  2. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

గంభీరావుపేట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో(Lingannapeta Village) భక్తుల కొంగుబంగారంగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం(Chariot Festival of Lord Sri Venkateswara) మంగళవారం కన్నుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది.

ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని రథంపై కొలువుదీర్చి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తుల ‘శ్రీనివాసా.. గోవిందా..’ నామస్మరణతో లింగన్నపేట మార్మోగింది. రథోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

వేద పండితుడు రాధాకృష్ణ శర్మ తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. రథోత్సవంలో కళాకారుల నృత్యాలు, వివిధ వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెంకటేశ్వర స్వామి వేషధారణలో కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, ఆలయ చైర్మన్ పాపారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, వైస్ చైర్మన్ భాస్కర్‌తో పాటు పలువురు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు