దేశంలో కీలకం కానున్న కేసీఆర్

24-10-2026 | 05:25am
  1. కాంగ్రెస్ చేతుల్లో మోసపోయిన వర్గాలన్నీ బీఆర్‌ఎస్ వైపే
  2. రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేడు
  3. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రంలో పాలన
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలోనే కాదు మళ్ళీ దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు దేశంలో కీలకం కాబోతున్నాయని వెల్లడించారు. నాలుగు సంవత్సరాల కింద కేసీఆర్ కాంగ్రెస్ కూటమి అంటే చాలామందికి అర్థం కాలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ తిరిగి సీఎం కావ డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ చేతుల్లో మోసపోయిన అన్ని వర్గాలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట నియోజకవర్గ నేత లతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నామని, ఒకవైపు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న బీజేపీకి ప్రత్యామ్నాయ ఎజెండా లేని కాంగ్రెస్‌ను చూసిన తర్వాత కేసీఆర్ చెప్పింది వాస్తవమని భావిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ఎంత చేసిన లాభం లేదని, రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడని ఎద్దేవా చేశారు.

దేశంలో కాంగ్రెస్ విఫలమైనందునే బీజేపీపై సీజేపీ పేరుతో యువతీ యువకులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ నాయకులను బీజేపీ బెదిరించగలుగుతుంది కానీ యువతకాన్ని కాదు అని అర్థమైందన్నారు. బీజేపీ గత పది సంవత్సరాలు ఎప్పుడు లేనంత బలహీనంగా తయారైందని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో కలిసిపోయి పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేవలం.. కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో అన్నివర్గాల్లో కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు పడితే 2017లో సెంచరీ కొట్టిన తీరుగా బీఆర్‌ఎస్ కార్పొరేషన్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని గుర్తుచేశారు. అడ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. 

ప్రాజెక్టులను నింపలేని సీఎం..

రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారని, తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని, పరిపాలన చేతకాక ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయని, తెలివిలేని రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులను నింపలేదని విమర్శించారు. కాళేశ్వరం పంపులు ప్రారంభిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తాను చేసిన అబద్ధాలు ప్రజల ముందు తేలిపోతాయని రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను కూల్చారని కేటీఆర్ ఆరోపించారు. రాహుల్‌గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డ కూలిపోయిందంటూ అబద్ధాలు చెప్పించారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారని చెప్పారు. రేవంత్ రెడ్డి దున్నపోతు ఈనిందంటే.. కిషన్‌రెడ్డి దూడను కట్టేయమంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని తెలిపారు. మరో ఏడాది రేవంత్‌రెడ్డి హడావిడి ఉంటుందని, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో లూటీ పాలన నడుస్తోందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని ఎన్నికల దాకా కలిసి  పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ధనబలాన్నే నమ్ముకున్నదని, బుద్ధి రావడం ఖాయమన్నారు.

మరిన్ని వార్తలు