ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్ ఎక్కడ?

24-10-2026 | 05:45am
  1. హామీలతోనే సరి.. ఇప్పటికే 
  2. సుమారు రూ. 10 వేల కోట్ల వరకు బకాయిలు
  3. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే
  4. సుమారు రూ. 60 వేల కోట్లు అవసరం

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు(Irrigation Projects) నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి కావడం సాధ్యమేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలు అట్టహా సంగా ఇప్పటిలోగా పూర్తిచేస్తాం.. అప్పటిలోగా పూర్తిచేస్తామంటూ చేస్తున్న వాగ్దానాలు నెరవేరడంపై మాత్రం అం తగా నమ్మకం కుదరడం లేదు.

అసలు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరుల విషయంలో ఈ అనుమానాలు మరింత బలపడటం గమనార్హం. పాలమూరు ప్రాజెక్టు వద్దనే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు, రం గారెడ్డి ప్రాజెక్టు ఎంత ముఖ్యమో చెబు తూ.. నిర్దేశించుకున్న గడువులోగా పూర్తిచేస్తామని తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టు పనులు కొనసాగడం లేదు. అసలు నిధుల కేటాయింపే సరిగా లేదంటూ అధికారవర్గాల్లోనూ చర్చ కొనసాగుతోంది.

అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును కూడా నిర్దేశించుకున్న గడువులోగా పూర్తిచేస్తామని మంత్రుల బృందం ప్రకటించింది. కొద్ది కాలం క్రితం సీతారామ ప్రాజెక్టు వద్ద సమీక్ష జరిపిన నలుగురు మంత్రు ల బృందం తమ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సంకల్పించిందని ప్రకటనలు గుప్పించారు.

అయితే సీతారా మ ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరత. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ.. సీతారామ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తారనే నమ్మకాన్ని అక్కడి ప్రజలు వ్యక్తంచేయడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం విషయంలో 2027 చివరి నాటికి పూర్తిచేసి శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తరలిస్తామని, సాగునీటికి, తాగునీటికి కొరత తలెత్తకుండా చూస్తామంటూ డాంబికాలు ప్రదర్శించారు. అయితే ఎక్కడ వేసిన గొంగ డి అక్కడే అన్న చందంగా పరిస్థితి నెలకొంది.

ఇక్కడకూడా సరైన బడ్జెట్ లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారవర్గాల సమాచారం. ఇక, ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు విషయంలో ఇంకా పెండింగు పనులు వేధిస్తూ నే ఉన్నాయి. సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత పుష్కర కాలం గడుస్తున్నా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు మూడేండ్ల కాలం అవుతున్నా.. దేవాదులను పూర్తిచేయలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు గడువు మీద గడువు పెడుతున్నా.. ఇప్పటికీ దేవాదులను 100 శాతం పూర్తిచేయలేకపోతు న్నార నే అపవాదు ఉండనే ఉంది. ఇక్కడకూడా బడ్జెట్‌దే ప్రధాన సమస్య.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి దాదాపు మూడేండ్ల కాలం అవుతోంది. ఇప్పటి వరకు రాజకీయంగా ఆరోపణలు, చట్టపరంగా విచారణ, నివేదికల దాఖ లు మాత్రమే పూర్తయ్యింది. ఇప్ప టివరకు దానిని మరమ్మత్తులు చేయలేకపోయింది. అయితే డ్యాం సేఫ్టీ అథారిటీ ఆ దే శాలు, సూచనల ప్రకారమే ముందుకు వెళతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సుమా రు రూ. 2500 కోట్లతో మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిధులు ఎక్కడి నుంచి తేవాలనేదికూడా సమస్యగా కనపడుతోంది. ఎల్ అండ్ టీ తమకు సంబంధం లేదంటూ తప్పించుకోవడంతో.. ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడిం ది. అయితే నిధుల సమీకరణ ఎలా అనేది తేలడం లేదు.

రూ. 60 వేల కోట్లు కావాలి..

ఇలా రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటి నీ పూర్తి చేయాలంటే.. సుమారు 60 నుంచి రూ.70 వేల కోట్లు కావాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటితోపాటు.. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస చర్యలు తీసుకోవాల్సి ఉంది. అనేక మందికి భూపరిహారంతోపాటు, పునరావాస చర్యలకుకూడా వేల కోట్లు కావాల్సి ఉంది. వెరసి ఇంత మొత్తం ఆర్థిక వనరులను ఎలా సేకరిస్తారనేది అనుమానాస్పందంగా కనపడుతోంది. కాంగ్రెస్ చేతిలో ఇంకా రెండేండ్ల కాలమే మిగిలి ఉంది.

కానీ చాలా వరకు ప్రాజెక్టులను ఒక సంవత్సరం లోనే పూర్తిచేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలు సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై చేసిన వాగ్ధానాలన్నీ నెరవేర్చాలంటే సంవత్సరానికి కనీసం రూ. 25 నుంచి రూ. 30 వేల కోట్ల ను కేటాయించాల్సిన అవసరం కనపడుతోంది. ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వం కేటా యించడం అసాధ్యమే. పోనీ ఇతర మార్గా ల్లో ఆర్థిక వనరులను సమీకరించే అవకాశం ఉందా అంటే.. అవికూడా కనుచూపుమేరలో కనపడటం లేదు. సాగునీటి ప్రాజెక్టుల కు బడ్జెట్ కనపడటం లేదు.. అందుకు ప్రణాళిక కూడా కనపడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

బకాయిలే.. రూ. 10 వేల కోట్లు..

ఇలా ఉండగా.. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టుల పనులకు సంబంధించిన బకాయిలే సుమారు రూ. 10 వేల కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ఇవికూడా చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాం టి ఉలుకూ.. పలుకూ కనపడటం లేదు. అటు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బడ్జెట్ లేకుండా.. ప్రణాళిక లేకుండా.. ఇటు బకాయిలు చెల్లించకుండా ప్రాజెక్టులను ఎలా పూర్తిచేస్తారనేది అర్థం కావడం లేదని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు.

వచ్చే ఎన్నికల సమయంలోగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే.. వనరుల సేకరణ, పక్కా ప్రణాళిక, నిరంతరం పర్యవేక్షణ ఉం డాలని, అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభు త్వం నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం సాధ్యమేనా అనే అను మానాలు వెల్లువెత్తుతాయని వారంటున్నారు. దీనివల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు