శాంతిభద్రతల విఘాతానికి కుట్రలు
దుష్టశక్తులను తిప్పికొట్టాలి
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): భారతదేశ ఎదుగుదలను ఓర్వలేక దేశ అంతర్గత శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నిరంతరం కుట్రలు పన్నుతున్న విదేశీ దుష్టశక్తుల యత్నాలను తిప్పికొట్టాలని, అందుకు దైవానుగ్రహం, ప్రజల ఐక్యత ఎల్లప్పుడూ తోడుండాలని దేవున్ని ప్రార్థించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు(BJP State President N. Ramchander Rao) తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో మల్లాపూర్లో ఘనంగా నిర్వహించిన ‘దేశ రక్షణ రక్షణ’ చండీ హోమయాగంలో రాంచందర్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గురు, చంద్రగ్రహాలతో పాటు సర్వ దేవతల అనుగ్రహంతో దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని, సమాజ వికాసానికి ధర్మ రక్షణే మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ సమర్థవంతమై న నాయకత్వంతో దేశాన్ని నిరంతరం ప్రగతి పథంలో ముందుకు నడిపించాలన్నారు. ఈ పవిత్ర క్రతువును సంకల్పించిన గీతామూర్తి కుటుంబంతో పాటు యావత్ భారత ప్రజానీకానికి సకల దేవతల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.