రేవంత్‌పై కవిత నిప్పులు
- హైదరాబాద్ పారిశుద్ధ్య నిర్వహణ ‘రాంకీ’కి కట్టబెట్టే యత్నం
- 50 వేల మంది కార్మికుల పొట్టగొట్టే ‘చెత్త’ఆలోచన
- నిర్ణయం మార్చుకోకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- రేవంత్ బ్రదర్స్ ల్యాండ్ గ్రాబింగ్
- గుక్కెడు నీళ్లివ్వలేనోళ్లు విశ్వనగరం కడతారా?
- ఫేక్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం
- గ్రేటర్లో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే
- ‘రాజధాని రణభేరి’లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)వి ‘చెత్త’ ఆలోచనలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నిప్పులు చెరిగారు. హైదరాబాద్ పారిశుద్ధ్య నిర్వహణను రాంకీ సంస్థకు అప్పగించి, 50 వేల మంది కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారని ఆరోపిం చారు. ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే సీఎం ఇంటిని ముట్టడించి, అక్కడే చెత్త పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ, సైబరా బాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో మియాపూర్‌లో నిర్వహించిన ‘రాజధాని రణభేరి’ సభలో ఆమె మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించే ప్రయత్నం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు.
కార్మికుల ఉపాధికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి ‘చెత్త’ ఆలోచనలకు నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ల్యాండ్ గ్రాబింగ్ కారణంగా హైదరాబాద్ చుట్టు పక్కల పంటలు పండే భూములను రైతులు కోల్పోవాల్సి వస్తుందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల పేరుతో సేకరించిన భూములను అభివృద్ధికి కాకుండా అవినీతి కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఐటీ ఉద్యోగులు ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారని, వారిని ఆదుకునేందుకు ఒక పాలసీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నకిలీ ఒప్పందాలు, తప్పుడు పెట్టుబడుల లెక్కలు
నకిలీ ఒప్పందాలు, తప్పుడు పెట్టుబడుల లెక్కలతో నిర్వహించతలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని కవిత హెచ్చరించారు. ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. వాటి వివరాలతో శ్వేతప త్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబర్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి పెట్టుబడులు కావాలని తామూ కోరుకుంటున్నామని, కానీ అబద్ధాలు, నకిలీ పెట్టుబడులతో మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
కనీసం తాగటానికి నీళ్లు ఇవ్వనోళ్లు విశ్వనగరం నిర్మిస్తామని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, దోమలు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడని.. వీళ్లా హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్ చేసే దంటూ ఎద్దేవా చేశారు. వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతాయో ఎవరికీ తెలియదని, సీనియర్ సిటిజన్స్‌కు భద్రత, గౌరవం లేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లో చెప్పులను ఏసీ షోరూముల్లో పెట్టి అమ్మితే, కూరగాయలు, చేపలను రోడ్లపై విక్రయిస్తున్నారని, ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి సోయి లేదని ధ్వజమెత్తారు. కూరగాయలు, చేపలు అమ్మే వారికి ఏసీ బండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బస్తీ దవాఖానాల్లో డాక్టర్ల సంఖ్య పెంచాలని, ప్రతి డివిజన్లో 24 గంటలు నడిచే హాస్పిటల్ ఉండాలని స్పష్టం చేశారు. ఫాగింగ్, రోడ్ల నిర్మాణం, కుక్కల బెడద నివారణ, చెత్త, డ్రైనేజీ నిర్వహణ.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి జరుగుతుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మానవత్వంతో కూడిన మార్పు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 వేలు జీతం వచ్చే వారైనా, లక్ష రూపాయలు జీతం వచ్చే వారైనా సరే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వాళ్లు షేర్లు అయితే.. మేము వేటగాళ్లం
తాము షేర్ అని బీఆర్ఎస్ నేతలు, బబ్బ ర్ షేర్ అని కాంగ్రెసోళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారని.. ఆ పులులను బంధించే వేటగాడు టీఆర్ఎస్ పార్టీ, ఈ విషయాన్ని ఆయా పార్టీల నేతలు గుర్తుంచుకోవాలని కవిత హెచ్చరించారు. ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని, అందుకోసం క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ కేడర్‌కు సూచించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందజేస్తామని చెప్పారు.
యూత్‌కు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే రాజకీయాలు మారుతాయని పేర్కొన్నారు. గ్రేటర్ లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో గల 300 డివిజన్లలో పోటీ చేస్తామని, మూడు కార్పొరేషన్లలో ఎగిరేది టీఆర్ఎస్ జెండాయేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీ నాయకులు ముఖ్యమంత్రి గులామ్‌గా కాకుండా ప్రజలకు గులామ్‌గా ఉండాలని హితవు పలికా రు. ముస్లింలను అన్ని పార్టీలు మోసం చేశాయని వారికి తాము మేలు చేస్తామని చెప్పారు.