గురుకులాల టెండర్ల అక్రమాలపై విచారించండి
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు హైదరాబాదీ ఫిర్యాదు
రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, డీవోపీటీ, చీఫ్ సెక్రెటరీ, విజిలెన్స్ డీజీకి కూడా..!
ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌పై ఆరోపణలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వివిధ గురుకులాలు, అందులోని ఉంటున్న లక్షలాది మంది విద్యార్థులకు కావాల్సిన వివిధ రకాల వస్తువుల కొనుగోలుకు సంబంధించి పిలిచిన టెండర్ల(Gurukula Tenders)లో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు హైదరాబాద్‌కు చెందిన జి.రాజేశ్‌కుమార్(G. Rajesh Kumar) ఫిర్యాదు చేశారు. వివిధ గురుకుల పాఠశాలల టెండర్లకు సంబంధించి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ద్వారా నిర్వహించిన టెండర్లలో అనేక అవకతవకలు, అక్రమాలపై విచారణ చేయించాలని ఆయన రాసిన లేఖలో ప్రస్తావించారు.
ఈ ఫిర్యాదును సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)తోపాటు కేంద్ర డీవోపీటీ సెక్రెటరీకి, రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు పంపించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలకు సంబంధించి విద్యార్థులకు సరఫరా చేయాల్సిన వివిధ వస్తువుల కొనుగోలు కోసం పిలిచిన టెండర్లలో పీఎంయూ (ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్) ద్వారా అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ టెండర్ల ద్వారా ఆహార సరుకులు, శుభ్రపరిచే సామగ్రి, యూనిఫాం వస్త్రాలు, ప్లేట్లు, గ్లాసులు, కటోరీలు, స్పూన్లు, హ్యాండిల్ ఉన్న కప్పులు, దుస్తులు, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, పాఠశాల బ్యాగులు, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, ఐడీ కార్డు హోల్డర్లు, స్టేషనరీ కిట్లు, ట్రాలీ బ్యాగులు, ట్రంక్ పెట్టెలు, కార్పెట్లు, బెడ్షీట్లు, పోలార్ ఫ్లీస్ దుప్పట్లు, తువ్వాళ్లు తదితర వస్తుసామగ్రి ఉంది. ఈ టెండర్లకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. న్యాయస్థానాల్లో జరిగిన విచారణల సందర్భంగా కూడా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందువల్ల ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అని సదరు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
ఆ ఆరోపణలు తేలాలి
‘2026 ఏప్రిల్ 21న ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన వార్తా కథనం ప్రకారం.. యూనిఫారాలు, పరుపులకు సంబంధించిన వస్తువుల కోసం పీఎంయూ జారీ చేసిన 2026 ఏప్రిల్ 2నాటి టెండర్ నోటిఫికేషన్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ముందుగా చేనేత వస్తువులను తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారానే కొనుగోలు చేయాలని, తరువాతనే ఇతరులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసే ప్రభుత్వ ఉత్తర్వును పీఎంయూ ఉల్లంఘించినట్లు కోర్టు నిర్ధారించినట్టు వార్తలో పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని కోర్టు పీఎంయూను ఆదేశించింది’ అని ఫిర్యాదుదారు తెలిపారు. రూ. 2000 కోట్ల ఈ టెండర్లలో భారీగా అవినీతి జరిగినట్టుగా ప్రతిపక్షానికి చెందిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ బహిరంగంగా ఆరోపణలు చేశారని, అయితే ఈ ఆరోపణలను మంత్రులు లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్‌లు ఖండించారని, అయినా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఎలాంటి నిర్ధారణ జరగకపోవడంతో.. స్వతంత్ర విజిలెన్స్ విచారణే సరైన మార్గమని తాను భావిస్తున్నట్టు ఫిర్యాదుదారు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 252 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం మొత్తం 45,360 బంకర్ బెడ్లను, వాటికి సంబంధించిన పరుపులు, దిండ్లతోపాటు సరఫరా, ఏర్పాటు, అమర్చడం కోసం ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్ర శిక్ష విభాగం నుంచి టెండర్ పిలిచారని, ఈ టెండర్‌ను దక్కించుకున్న మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోట్ చేసిన ప్రకారం ఒక్కో బంకర్ బెడ్ ఖరీదు రూ. 33 వేలుగా ఉందని, అయితే అదే బంకర్ బెడ్ యూనిట్‌ను రూ. 17,200కే కొనుగోలు చేయవచ్చని, దీనికి సంబంధించి పీవో నెం. ఎంఐఎల్/బీబీ/2025 తేది 5.12.2025ను కోర్టులో వేసిన వెకేట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆధారంగా సమర్పించినట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 160 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అందులో తెలిపారు. పీఎంయూ ఆధ్వర్యంలో పిలిచిన ఆహార సరుకులు, శుభ్రపరిచే సామగ్రికి సంబంధించిన టెండర్లలో ఒక టెండర్‌ను ‘నాకాఫ్’ (ఎన్ఏసీవోఎఫ్) పొందిందని తెలిపారు. గతంలో పనితీరు సరిగా లేని సంస్థగా ప్రకటించిన సరఫరాదారుకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడానికి ఎలాంటి ప్రమాణాలు, నియమాలు అనుసరించారో విచారణ చేయాలని కోరారు.
అర్హతలు లేని అధికారికి బాధ్యతలా?
తెలంగాణ ప్రభుత్వం కంభంపాటి శారదకు 4 మే 2026 తేదీన జీవో నెం. 107 ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూర్ఈఐఎస్) సెక్రెటరీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిందని.. అలాగే ఆమె ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని, పీఎంయూ ద్వారా పెద్ద ఎత్తున జరిగే పరిపాలనా కొనుగోళ్లు, టెండర్లను పర్యవేక్షిస్తున్నారని.. నిజానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కాని ఒక అధికారిని సొసైటీ ఛైర్మన్‌గా నియమించారని, ఇది తెలంగాణ చరిత్రలో మొదటిసారి అని ఫిర్యాదుదారు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారు.