మనకాలం వీరుడు

23-10-2026 | 05:50am
  1. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి ఇక అధికారికంగా..
  2. అవసరమైతే బీసీల లెక్కలు సవరిస్తాం 
  3. ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చే అంశంపై అధ్యయనం n ట్యాంక్‌బండ్‌పై సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు
  4. పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
  5. పాలమూరు జిల్లా, వర్సిటీకి పండుగ సాయన్న పేరు పెట్టాలి
  6. మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి

హైదరాబాద్/ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. వందేళ్లలో ఎవరూ చేయని సాహసాన్ని తమ ప్రభుత్వం చేసిందని తెలిపారు. ఏడాదిలోనే కులగణన పూర్తిచేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను తేల్చామని పేర్కొన్నారు.

ముదిరాజ్ లను బీసీ డీ గ్రూప్ నుంచి బీసీ ఏ లోకి మార్చాలనే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో గంగపుత్రులలో నెలకొన్న అపోహలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజ్ బిడ్డలకు అనేక అవకాశాలు కల్పించామని రేవంత్ తెలిపారు. త్వరలో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న లెక్కల్లో ఎవరైనా తమ వివరాలు నమోదు కాలేదని భావిస్తే, వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే బీసీ కులగణన లెక్కలను సరిచేసి, జాబితాలోకి రాని వారిని చేర్చుతామని ప్రకటించారు.

సంబంధిత వివరాలు అందించాలని సూచించారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి లెక్కలను మరింత పక్కాగా చేయిస్తామని తెలిపారు. అవకాశం ఉంటే నా కుర్చీ చుట్టూ బలహీనవర్గాలను కూర్చోబెట్టుకోవాలన్నది నా ఆలోచన అని అన్నారు. ‘బ్రిటీష్ హయాంలో కుల గణన చేశారు.. వందేళ్ల తర్వాత మా ప్రభుత్వం కుల గణన చేపట్టింది. కుల గణన చేసినందునే ఈ రోజు బలంగా ప్రతి కులం తమగళం వినిపిస్తోంది. జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశాం..’ అని పేర్కొన్నారు.

సాయన్న కుటుంబానికి అండగా.. 

‘నాకు ఇంకా వయసు, ఓపిక ఉన్నాయని.. నేను ఫామ్‌హౌస్‌లో పడుకునే రకాన్ని కాదు’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. సాయన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారు. ట్యాంక్ బండ్‌పై వారి విగ్రహాలను ఆవిష్కరిస్తాం.

సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు జీవితమంతా సమాజం కోసమే జీవించారు. వారి సేవలను స్మరించుకోవడం అందరి బాధ్యత’ అని పేర్కొన్నారు. బహుజనుల జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అన్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని, ఆ ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి ముదిరాజ్‌లు అండగా నిలవాలని రేవంత్ కోరారు.  

ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ..!

తాను పీసీసీ అధ్యక్షుడిని కాగానే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ను డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించానని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేశానని సీఎం తెలిపారు. నీలం మధుకు ఎంపీ ఎంపీ టికెట్ ఇచ్చామన్నారు. ముదిరాజ్‌లకు ఎమెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం సూచించారు. ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదన్నారు.

‘నాడు ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఇప్పుడు మనం 3.48 కోట్ల మంది నేడు సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం. తెలంగాణ వచ్చాక రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించుకున్నాం. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ అమలు చేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’ అని సీఎం తెలిపారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలని సీఎంను కోరారు. పండుగ సాయన్న చరిత్ర, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్, సునితారావు, మోత రోహిత్ తదితరులు పాల్గొన్నారు.  

కొడంగల్‌లో ముదిరాజ్‌లే ఎక్కువ  

తాను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజ్‌లేనని సీఎం రేవంత్ తెలిపారు. నిజాం హయాంలో దొరలు పేదల భూమి ఆక్రమిస్తుంటే పేదలకు అండగా సాయన్న నిలిచాడని, ప్రజలకు ధాన్యం పంచడమే కాదు, పేద ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసిన ఘనత సాయన్నదని సీఎం కొనియాడారు. సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి విడిపించారని, అయితే సాయన్నను అన్యాయంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయన్న చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో సాయన్న పాటలు వినిపిస్తున్నాయని తెలిపారు. 


మరిన్ని వార్తలు