డిండికి పాలమూరు నీళ్లొద్దు

23-10-2026 | 05:45am
  1. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పాలమూరు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
  2. ఏదుల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తీసుకెళ్లండి
  3. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలని వినతి
  4. అధికారులతో చర్చించి అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపును ఆపాలని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy)కి విజ్ఞప్తి చేశారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా నీరు తీసుకోవాలని నేతలు కోరారు.

గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవితో పాటు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. వారు దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఏదుల నుంచి డిండికి నీటిని తరలించే అంశాన్ని చర్చించారు.  డిండి ప్రాజెక్టు విషయంలో పాలమూరు జిల్లాలోని ఇబ్బందులను మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకె ళ్లారు. డిండి ప్రాజెక్టుకు నీరు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఏదుల నుంచి నీటిని తీసుకుంటే పాలమూరు ఆయకట్టుకు ఇక్కట్లు ఎదురవుతాయని చెప్పారు. పాలమూరు రైతులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటిని తరలించాలని కోరారు.

ఈ అంశంపై అధికారులతో చర్చించి అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఉమ్మడి పాలమూరు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. అంతేకాకుండా పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు.

ఏదుల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తే ఎగువ ప్రాంతాల్లోని పాలమూరు ఆయకట్టుకు నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. అయితే డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు అంశంపై పాలమూరు జిల్లా నేతల్లో గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ, పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపైన చర్చించామని తెలిపారు. పాలమూరు, నల్లగొండ రైతులకు ఎటువంటి నష్టం, ఇబ్బందులు కలగకుండా చూస్తామని, అధికారులతో చర్చించి 

అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణ యం తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి- జూపల్లి తెలిపారు. తమ పాలమూరు జిల్లా ప్రయోజనాలకు అ న్యా యం చేయరనే నమ్మకం తమకు ఉందని జూపల్లి అన్నారు. పాలమూరు ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు జూపల్లి చెప్పారు.

మరిన్ని వార్తలు