ఎన్కేపల్లి గణేశుడి లడ్డూ వేలం
- వేలం పాటలో సంగం రామేశ్వర్ కైవసం..
- భక్తుల సందడిలో గణేశుడి నిమజ్జనం
మొయినాబాద్ సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): మున్సిపాలిటీ(Municipality) పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో(Enkepalli Village) గణేశుడి లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగింది. శుక్రవారం నిర్వహించిన గణేశుడి నిమజ్జనం సందర్భంగా కౌన్సిలర్లు ముదిగొండ ప్రభాకర్‌యాదవ్, మధ్యపాగు మహేష్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో లడ్డూల వేలం నిర్వహించారు. గ్రామంలోని వివిధ కాలనీలకు చెందిన గణేశుడి లడ్డూలను భక్తులు పోటీపడి దక్కించుకున్నారు.
అనంతరం గ్రామ ప్రధాన గణేశుడి లడ్డూకు నిర్వహించిన వేలంలో సంగం రామేశ్వర్ రూ.10,15,000కు కైవసం చేసుకున్నారు. భక్తిభావంతోనే లడ్డూ తనకు దక్కిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు నిర్వహించారని తెలిపారు.
50 ఏళ్లుగా ఒకేరోజు నిమజ్జనం: ఎన్కేపల్లి గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఒకేరోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మొయినాబాద్ సీఐ వై. మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.