ఢిల్లీకి అఖిలపక్షం
- ఎల్ నినో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది
- కరువుపై కేంద్రానికి నివేదిక పంపించాం
- అఖిలపక్ష నేతల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తాం..
- అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
- భేటీకి హాజరైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీడీపీ,
- బీఎస్పీ, టీజేఎస్, ఎస్పీ, ఆర్జేడీ, ఆమ్ఆద్మీ పార్టీల ప్రతినిధులు
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఎల్ నినో(El Nino) ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, అవసరమైన సమ యంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని స్పష్టంచేశారు.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమిష్టి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. ఎల్ నినో ప్రభా వం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నోడల్ అధికారి రామక్రిష్ణరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విపత్తు పరిస్థితులను ఎదుర్కొనే సమ యంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి సమావేశం నిర్వహించామని తెలిపారు. నేతలు ప్రస్తావించిన అంశాలను నమోదు చేసుకున్నామని, సాధ్యమైన మేరకు వాటిని ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎల్ నినో ప్రభావంపై గతంలోనూ శాసనసభలో చర్చించామని, వివిధ సమావేశాలు, సదస్సులు నిర్వహించడంతోపాటు శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపామని వివరించారు.
ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రానున్న నెలల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైన సన్నద్ధతతో ఉన్నామని పేర్కొన్నారు. వర్షపాతం లోటు ఒక్క తెలంగాణకే పరిమితమైతే పొరుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం ఉండేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షపాతం లోటు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రత్యామ్నాయ ప్రాంతాల నుంచి నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లో జలవనరుల నిర్వహణ మరింత కీలకంగా మారిందని వివరించారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనావేస్తూ, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు శాఖలవారీగా సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామని, పశువులకు తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష నేతలు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న సమయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేశాయని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి..
ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున అంజన్‌కుమార్ యాదవ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున వినోద్‌కుమార్, ఎల్ రమణ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీజేపీ తరఫున శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సమాజ్‌వాది పార్టీ నాయకులు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నాయకురాలు శోభా యాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శ్రీరామ్ కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హేమ సుదర్శన్, తెలుగుదేశం పార్టీ తరఫున కాట్రగడ్డ ప్రసన్నకుమార్ తదితరులు కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, రైతులకు అండగా నిలిచే చర్యలు, తాగునీరు-సాగునీటి సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేయనున్న ఎల్ నినో సమస్యపై అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం వహిస్తే సమస్య తీవ్రతను చెప్పినట్టయ్యేదని.. బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా రాజకీయ పార్టీల నాయకులను సీఎం స్వయంగా కలిసి ఆహ్వానిస్తే బాగుండేదని కొందరు ప్రతిపక్ష నాయకులు భావించారు.
- మేడిగడ్డ కూలడం వల్లే..
- ప్రాణహిత వరద నిల్వచేయలేకపోయాం
- కృష్ణా జలాలను మనమే ఎక్కువగా వినియోగించుకున్నాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మేడిగడ్డ కూలిపోవడంతోనే ప్రాణహిత వరద నిల్వ చేయలేకపోతున్నామని నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాణహిత వరద నిల్వ చేయకపోవడంతోనే ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని మంత్రి అన్నారు. అఖిలపక్ష సమావేశంలో కృష్ణా జలాల వినియోగంపై వాస్తవాలు వెల్లడించినట్లు తెలిపారు.
కృష్ణా జలాల వినియోగంపై బీఆర్ఎస్ మాటలు అవాస్తమన్నారు. ఇప్పటివరకు శ్రీశైలం నుంచి తెలంగాణ 127 టీఎంసీలు నీళ్లు వాడుకుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం నుంచి 72 టీఎంసీలు వాడుకుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. నాగార్జునసాగర్‌లో తెలంగాణ వినియోగం 41 టీఎంసీలు, ఏపీ 17 టీఎంసీలే వాడుకున్నదని మంత్రి తెలిపారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మత్తులు చేపట్టామని , కేంద్ర జల్‌శక్తి సాంకేతిక కమిటీ మార్గదర్శకాల ప్రకారమే మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు గేట్లు దించొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని, మేడిగడ్డ గేట్లు దించకుండా నీరు ఎత్తిపోసి నిల్వ చేయడం సాధ్యం కాదన్నారు. మేడిగడ్డ కుంగడానికి లోపభూయిష్టమైన డిజైన్, నిర్మాణమే కారమని మంత్రి చెప్పారు. అన్నారం, సుందిళ్లను కూడా వినియోగించవద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కరువు పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల, నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
అంతర్రాష్ట నదీజలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తంచేసిన ఆందోళనలను ప్రభుత్వం శ్రద్ధగా ఆలకించిందని మంత్రి పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించే సమయంలో వారి అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నిర్మాణాత్మక దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.