రైల్వేస్టేషన్‌ కేంద్రంగా గంజాయి దందా!

30-09-2026 | 02:45pm
  1. ఒడిశా నుంచి నగరానికి అక్రమ రవాణా ఇద్దరి అరెస్టు
  2. 1.5 కిలోల గంజాయి,సెల్‌ఫోన్లు స్వాధీనం

శేరిలింగంపల్లి,సెప్టెంబర్30(విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా (Marijuana trafficking)వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1.5 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్‌ ఫోన్లు, ప్యాకింగ్‌కు ఉపయోగించే పాలిథిన్ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను మెరిపాటి మనోజ్‌కుమార్ (22), ఎం. ఆశాజ్యోతి (23)గా పోలీసులు గుర్తించారు.పోలీసులకు అందిన సమాచారంతో చందానగర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గుర్తించిన వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా గంజాయి బయటపడింది.

విచారణలో ఒడిశాలోని కుందులి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. నగరంలో వీరికి గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, కొనుగోలు చేస్తున్నవారు, ఈ వ్యవహారం వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు