భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

29-10-2026 | 05:40am

రాష్ట్రంలో 12 మందికి స్థానచలనం

  1. కీలక పోస్టు నుంచి జయేష్ రంజన్‌కు ఉద్వాసన
  2. సర్పరాజ్ అహ్మద్‌కు ముఖ్యమైన బాధ్యతలు 
  3. వికాస్‌రాజ్ ఇంధన శాఖకు మార్పు
  4. పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్‌గా నవీన్ మిట్టల్ 
  5. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ 
  6. రాహుల్ బొజ్జాకు అదనంగా గిరిజన సంక్షేమం 
  7. ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి
  8. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ 
  9. జితిన్ పాటిల్‌కు అదనంగా రెడ్కో బాధ్యతలు 
  10. మహిళా, శిశు సంక్షేమ శాఖల కార్యదర్శిగా శృతి ఓజా 
  11. వైద్యశాఖ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ నియామకం 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో భారీగా ఐఏఎస్ అధికారుల(IAS Officers) బదిలీలు జరిగాయి. మొత్తం 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభు త్వం స్థానచలనం కలిపించింది. అందులో ఒకరిద్దరికి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్ఛం ద ఉద్యోగ విరమణ ఆలోచనలో ఉన్న సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్‌ను మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక సీఎస్ బాధ్యతల నుంచి తప్పించింది.

పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరి యా సెక్రటరీతో పాటు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా హెచ్‌ఎం డీఏ కమిషనర్ సర్పరాజ్ ఆహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. వికాస్ రాజుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శిగా, నవీన్ మిట్టల్‌ను పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, వాణీ ప్రసాద్‌ను క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ట్రాన్స్‌ఫర్ చేసింది.

రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అదనంగా కట్టబెట్టింది. కె.ఇలంబర్తిని రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా, మహిళా , శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓజాను నియమించారు. ఎస్సీ శాఖ స్పెషల్ సెక్రటరీగా, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎస్. సంగీత సత్యనారాయణ , ఎస్పీడీసీఎల్ ఎండీ జితేశ్ పాటిల్‌కు టీజీ రెడ్కో వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 

వీఆర్‌ఎస్‌లో జయేష్ రంజన్.. 

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ ) పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన జయేష్ రంజన్‌ను అటవీ, పర్యావరణ శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే జయేష్ రంజన్ ఇప్పటికే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనకు.. సీఎస్‌గా రామకృష్ణారావు ఉద్యోగ విమరణ అనంతరం ఆ స్థానంలో అవకాశం వస్తుందని అందరూ భావిం చా రు. కానీ, అదే బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజును ప్రభుత్వం సీఎస్‌గా నియమించింది. అప్పటి నుంచి జయేష్ రంజన్ అసంతృప్తిగా ఉన్నట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

గవర్నర్ స్పెషల్ సీఎస్‌గానే దాన కిశోర్..

సీనియర్ ఐఏఎస్ ఎం దానకిశోర్‌ను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్‌కు చెందిన దాన కిశోర్ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను గవర్నర్ ప్రత్యేక సీఎస్‌గా పునర్నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు, షరతులను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీఓ ఆర్టీ నంబర్ 1554ను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు