పల్లె ప్రగతికి పెద్దపీట: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

22-09-2026 | 09:55pm

- నాగల్‌గిద్ద మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

- ఎర్రబొగడలో పాఠశాల ప్రహరి ప్రారంభం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) అన్నారు. నాగల్‌గిద్ద మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఇరాక్‌పల్లిలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

మావినెల్లిలో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవనం, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సక్రూ నాయక్ తండాలో రూ.30 లక్షలతో చేపట్టిన కల్వర్టు వంతెనను ప్రారంభించారు. వర్షాకాలంలో తండా ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు ఈ వంతెన దోహదపడుతుందన్నారు. ఎర్రబొగడలో ప్రభుత్వ పాఠశాల ప్రహరి గోడను ప్రారంభించి, అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. విద్యార్థుల భద్రతే ముఖ్యమన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్డుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. రహదారులతో రవాణా సౌకర్యం మెరుగవుతుందని, మహిళా సమైక్య భవనం సంఘాల సమావేశాలు, శిక్షణలకు ఉపయోగపడుతుందన్నారు. పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు