ఆగని నీటి దందా, పట్టించుకోని అధికారులు

24-10-2026 | 09:58am

పేపర్లలో వరుస కథనాలు, క్షేత్రస్థాయిలో కనిపించని చర్యలు!

పటాన్ చెరు, అక్టోబర్ 24: పటాన్‌చెరు: పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం, అమీన్‌పూర్, గుమ్మడిదల ప్రాంతాల్లో నీటి దందా ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. లక్షల లీటర్ల నీటి వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా, బాధ్యులపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

రోడ్లపై వాటర్ ట్యాంకర్ల జాతర!

ప్రధాన రహదారులపై వాటర్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో తిరుగుతుండటంతో నీటి సరఫరా, రవాణా, అనుమతుల వ్యవహారంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీటి వనరుల నుంచి ఎంత మేరకు నీటిని సేకరిస్తున్నారు? వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యాపారానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారం నీటి వినియోగం జరుగుతోందా? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు స్పందించరా?

నీటి దందాపై ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ట్యాంకర్ల రాకపోకలు, నీటి వనరుల వినియోగం, అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై పరిశీలన చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు.

పత్రికా కథనాలకే పరిమితమా?

వరుసగా వార్తలు వెలువడుతున్నా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా నీటి సేకరణ లేదా సరఫరా జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నీటి దందాపై సమగ్ర విచారణ చేపడతారా? లేక ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి. ప్రజల అవసరాలకు ఉపయోగపడాల్సిన నీటి వనరుల దుర్వినియోగం జరగకుండా చూడటం అధికారుల బాధ్యత. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు