ప్రశ్నించినందుకు కత్తితో దాడి
నలుగురికి గాయాలు.. మరో ఇద్దరిపై రాడ్లతో దాడికి యత్నం
కొండపాక,(విజయక్రాంతి): వేగంగా కారు నడపడంపై ప్రశ్నించిన యువకులపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కొండపాక మండలం వెలికట్ట ఎక్స్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలుకాగా, మరో ఇద్దరిపై రాడ్లతో దాడికి యత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వెలికట్ట గ్రామానికి చెందిన మెరుగు ప్రభాస్ తన స్నేహితులతో కలిసి ఈ నెల 20న రాత్రి డెక్కన్ చాయ్ హోటల్‌లో టీ తాగి బయటకు వస్తుండగా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారు వేగంగా వచ్చి వారి బైక్ ముందు ఆగింది. దీంతో ప్రమాదకరంగా కారు నడపడంపై యువకులు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో కారులో ఉన్న రమేష్ కత్తితో ప్రభాస్‌పై దాడి చేయగా, అడ్డుకునే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. అడ్డుకోబోయిన భాస్కర్, నరేందర్, రంజిత్‌కుమార్‌లపై కూడా కత్తితో దాడి చేయడంతో వారు గాయపడ్డారు. అక్కడే ఉన్న దుద్దెడకు చెందిన బస్వరాజ్ చంద్రుపై సైతం దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఇద్దరు రాకేష్, ధర్మపాల్ రాడ్లతో దాడికి యత్నిస్తూ దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుడు మెరుగు ప్రభాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు క్రైమ్ నంబర్ 207/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.