విద్యుత్ సరఫరా పెంచాలి

17-10-2026 | 04:05pm

ఎండిపోతున్న వరి పంటను కాపాడాలి

పిడిచెడ్‌లో పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి

బాధను వ్యక్తం చేసిన రైతులు 

గజ్వేల్: విద్యుత్ సరఫరా సక్రమంగా లేక వరి పంట ఎండిపోతోందని పిడిచెడ్ గ్రామ రైతులు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి(District Agriculture Officer Swaroopa Rani) దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె వెంటనే విద్యుత్ శాఖ ఏఈ, ఏడిలతో మాట్లాడి సరఫరా పెంచాలని కోరారు. విద్యుత్ సరఫరాను పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.

గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామం(Pidiched Village)లో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, సహాయ వ్యవసాయ సంచాలకులు బాబు నాయక్ వరి, పత్తి పంటలను పరిశీలించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. వరి పంటలో కాండం తొలిచే పురుగు ఉనికిని గుర్తించిన అధికారులు, నష్టం తీవ్రతను బట్టి వ్యవసాయ శాఖ సూచనల(Department of Agriculture instructions) మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

పత్తి పంట ప్రస్తుత పరిస్థితులను తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పంట పరిస్థితులను బట్టి 13-0-45 ఎరువు, ఫార్ములా-4ను సిఫార్సు చేసిన మోతాదులో వినియోగించి పిచికారీ చేయాలని సూచించారు. రసం పీల్చే పురుగుల నివారణకు వ్యవసాయ అధికారుల సలహా మేరకు మందులు వాడాలన్నారు.

కంది పంటలో  పరిస్థితులు, కాయ తొలిచే పురుగు నివారణపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించాలని, ఎరువులు, పురుగుమందులను సిఫార్సు చేసిన మోతాదులోనే వినియోగించాలని సూచించారు. అనవసరంగా వివిధ మందులను కలిపి పిచికారీ చేయవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిడిచెడ్ సర్పంచ్ అశోక్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి గణేశ్, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు