టీమిండియాదే స్వర్ణం
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లోనూ భారత్ అదరగొట్టింది. మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండోసారి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో టీమిండియా 19 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులతో పాటు బౌలింగ్‌లో రాణించిన భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
- పాక్‌పై అద్భుత విజయం
- అభిషేక్, తిలక్ వర్మ మెరుపులు
- భారత్ భారీ స్కోరు
- వరుసగా రెండోసారి పసిడి కైవసం
నిస్సాన్, అక్టోబర్ 3 : టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ భారీ ఆరంభాన్నివ్వలేకపోయారు. వైభవ్ 15 పరుగులకే ఔటవగా, సంజూ శాంసన్ కూడా నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.తనదైన శైలిలో చెలరేగిపోయాడు. ఆరంభంలో కాసే పు ఆచితూచి ఆడినా తర్వాత గేర్ మార్చా డు.
దీంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 81 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసు కున్నాడు. మరింత దూకుడుగా ఆడే క్రమం లో అభిషేక్ శర్మ 61 (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులకు వెనుదిరిగాడు. తర్వా త శ్రేయాస్ అయ్యర్(21) కూడా ఔటవడంతో భారత్ కష్టాల్లో పడినట్టు కనిపిం చింది. ఈ దశలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కీలక పార్టనర్‌షిప్ నమోదు చేశారు.
తెలుగుతేజం తిలక్ వర్మ మరోసారి పాక్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 51 నాటౌ ట్( 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. ఇషాన్ (21) రన్స్ చేయగా, చివర్లో శివమ్ దూబే కూడా 15 బంతుల్లోనే 27 (2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌లో పాకిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఇక మ్యాచ్ ఏకపక్షమే అనుకున్న దశలో హసన్ నవాజ్, సైమ్ అయూబ్ జట్టును ఆదుకున్నారు. అయితే ఆరంభంలోనే హసన్ నవా జ్ ఇచ్చిన క్యాచ్‌ను వైభవ్ సూర్యవంశీ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే హసన్ నవాజ్ 4 పరుగులకే వెనుదిరిగేవాడు. కానీ ఈ అవకాశంతో అతను భారత్‌ను వణికించాడు. సైమ్ ఆయూబ్‌తో కలిసి కీలక భాగ స్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆయూబ్ ఆచితూచి ఆడినా హసన్ నవాజ్ చెలరేగాడు.
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బా దాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శివమ్ దూబే విడ దీసాడు. సైమ్ అయూబ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపడంతో 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సైమ్ అయూ బ్ వెనుదిరిగినా.. నవాజ్ తన దూకుడు కొనసాగించాడు. కానీ అతనికి మరో ఎండ్ లో సహకారం లభించలేదు. ఆఖరి ఓవర్లో పాకిస్థాన్ విజయానికి 33 పరుగులు రాగా.. శివమ్ దూబే బంతిని అందుకున్నాడు.
తొలి బంతినే నవాజ్ బౌండరీ తరలించడంతో మరుసటి బంతిని శివమ్ దూబే వైడ్ చేశాడు. దాంతో భారత అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అయితే అద్భుతమైన యార్కర్‌తో వరుసగా రెండు డాట్ బాల్స్ వేయడంతో భారత విజయం లాంఛనమైం ది. కీలక భాగస్వామ్యాన్ని విడదీయడం తో పాటు ఆఖరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శివమ్ దూబే భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.దీంతో పాక్ జట్టు 192 పరుగులు చేయగా, నవాజ్ 96 పరుగులతో చివరి బంతికి ఔటయ్యాడు. ఈ విజయంతో ఆసియాక్రీడల్లో వరుసగా రెండోసారి భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 211/6 (అభిషేక్ 61, తిలక్ వర్మ 51 నాటౌట్, దూబే 27, శ్రేయాస్ 21 ; అహ్మద్ 2/43, అరాఫత్ 2/25)
పాకిస్తాన్ ఇన్నింగ్స్ : 192/6 (హసన్ నవాజ్ 96, ఆయూబ్ 29, సదాత్ 23 ; అక్షర్ పటేల్ 2/29, వాషింగ్టన్ సుందర్ 2/29, దూబే 2/33)