నాలుగో స్థానంలోనే సరి!
ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు
- చివరిరోజు క్రికెట్, హాకీ, ఆర్చరీ, రెజ్లింగ్, గోల్ఫ్‌లో స్వర్ణాలు
- గతంతో పోలిస్తే తక్కువే..
- పతకాల పట్టికలో 4వ స్థానం
- 85 పతకాలు సాధించిన భారత్
- 2022తో పోలిస్తే తగ్గిన మెడల్స్
- కీలక ఈవెంట్లలో నిరాశ
నగోయా, అక్టోబర్ 3 : జపాన్ వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల్లో (Asian Games)భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిం ది. క్రీడల ఆఖరి రోజుల్లో భారత అథ్లెట్లు సాధించిన వరుస విజయాల కారణంగా మొత్తం 85 పతకా లు కైవసం చేసుకుంది. దీనిలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలోనే ఇది భారతదేశానికి రెండవ అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది.అయితే 2022 హాంగ్చౌతో పోలిస్తే మాత్రం పతకాలు తగ్గాయి.
అప్పుడు 106 పతకాలతో భారత్ సత్తా చాటింది. ఈ సారి అథ్లెట్లు భారత్‌కు అత్యధిక పతకాలు అందించారు. అథ్లెటిక్స్‌లో మొత్తం 24 పతకాలు దక్కాయి. దీనిలో 1 స్వర్ణం, 9 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల 4x400 మీటర్ల రిలే జట్టు స్వర్ణ పతకం సాధించి మెరిసింది. అథ్లెట్ గుల్వీర్ సింగ్ 10,000 మీటర్లు, 1500 మీటర్ల పరుగులో రజతాలు, 5000 మీటర్లలో కాంస్యం సాధించి సత్తా చాటాడు. అలాగే షూటింగ్లో 15 పతకాలు లభించాయి.
షూటర్లు 3 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో రాణించారు. నీరు ధండా ట్రాప్ ఈవెంట్లలో రెండు స్వర్ణాలు సాధించి అదరగొట్టింది. ఇక ఆర్చరీలో 9 పతకాలు గెలిచారు. ఈ క్రీడలో 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన చికిత తనిపర్తి కాంపౌండ్ విభాగంలో (మహిళల టీమ్, మికస్డ్ టీమ్) రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. కాగా బాక్సింగ్‌లో సైతం మన పంచ్ అదిరింది.
మొత్తం ఆరు పతకాలు రాగా దీనిలో 3 స్వర్ణాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ పతక విజేత లవ్లినా బోర్గోహైన్ (75 కేజీల విభాగం) ఆసియా క్రీడల్లో తన తొలి స్వర్ణాన్ని ముద్దాడింది. మరోవైపు క్రికెట్, హాకీ, కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలతో మెరిసాయి.
