సిరీస్ చిక్కెదెవరికో?

27-11-2026 | 05:30am
  1. నేటి నుంచే భారత్, కివీస్ చివరి టెస్ట్
  2. బ్యాటర్లకు పేస్ పరీక్ష
  3. తుది జట్టులోకి సిరాజ్ ?
  4. గుర్నూర్ బ్రార్ అరంగేట్రం

తొలి టెస్టులో గెలుపు అవకాశాలు సృష్టించుకున్నా బౌలర్ల వైఫల్యంతో డ్రాతో   సరిపెట్టుకున్న భారత్ ఇప్పుడు చివరి టెస్టుకు సిద్ధమైంది. కివీస్ గడ్డపై 17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించే లక్ష్యంతో సిరీస్ విజయంపై కన్నేసింది. బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నప్పటకీ, బౌలర్లు కూడా పూర్తిస్థాయిలో రాణిస్తే తప్ప గెలుపు ఆశించడం అత్యాశే. తుది జట్టులో మార్పులకు అవకాశముందన్న నేపథ్యంలో భారత్ ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో చూడాలి.

క్రైస్ట్‌చర్చ్, నవంబర్ 26 : భారత జట్టు న్యూజిలాండ్(India vs New Zealand) పర్యటన చివరి అంకానికి చేరింది. టీ20, వన్డే సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఇప్పుడు టెస్ట్ సిరీస్‌ను కూడా గెలిచేందుకు ఆఖరి అవకాశం. క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. నిజానికి తొలి టెస్టులో విజయం సాధించే అవకాశమున్నప్పటకీ కివీస్ బ్యాటర్ల అసాధరణ పోరాటంతో పాటు బౌలర్ల వైఫల్యంతో డ్రాగా ముగించాల్సి వచ్చింది. అదే సమయంలో తుది జట్టు కూర్పుపైనా విమర్శలు వచ్చాయి. సిరాజ్ లాంటి పేసర్‌ను పక్కన పెట్టడాన్ని మాజీలు సైతం తప్పుపట్టారు. రెండో టెస్టులో అతన్ని ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది జట్టులో మార్పులు కేవలం బౌలింగ్‌కే పరిమితం కానున్నాయి.

ఎందుకంటే బ్యాటింగ్ పరంగా అందరూ మంచి ఫామ్‌లో ఉండడమే దీనికి కారణం.భారత బౌలర్లు 20 వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కాంబినేషన్‌ను చూసుకుంటే బుమ్రాకు తోడుగా సిరాజ్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ లేదా గుర్నూర్ బ్రార్‌కు చోటు దక్కనుంది. తొలి టెస్టులో నిరాశపరిచిన ప్రసిద్ధకృష్ణపై వేటు పడే అవకాశాలున్నాయి. స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌నే కొనసాగిస్తారా లేక జడేజాను ఆడిస్తారా అనేది చూడాలి. తుది జట్టులో రెండు మార్పులు మాత్రం ఖాయంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అటు బ్యాటింగ్‌పరంగా మాత్రం జైస్వాల్,రాహుల్,పంత్ రాణిస్తున్నారు.

మరోవైపు తొలి టెస్టులో ఓటమి అంచుల నుంచి పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆత్మవిశ్వాసంతో కివీస్ బరిలోకి దిగుతోంది. కెప్టెన్ టామ్ లాథమ్ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ బుమ్రా బౌలింగ్‌లో విఫలమయ్యాడు, కాబట్టి అతను ఫామ్‌లోకి రావడం ఆ జట్టు చాలా కీలకం. గాయం కారణంగా బ్లెయిర్ టిక్నర్ దూరం కావడంతో అతని స్థానంలో మాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. వెల్లింగన్‌లో బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌కు భిన్నంగా, హేగ్లీ ఓవల్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది.తొలి టెస్టులో భారత్ 720 పరుగుల భారీ స్కోరు సాధించినా పిచ్ సహకరించక డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కానీ ఇక్కడ బౌలర్లకు అనుకూలించే సమతుల్యమైన పిచ్ ఉండే అవకాశం ఉన్నందున మ్యాచ్‌లో ఖచ్చితంగా ఫలితం వస్తుందని అంచనా. దీంతో కివీస్ పేసర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూలాడి. ఇక్కడ జరిగిన టెస్టుల్లో 90 శాతానికి పైగా వికెట్లు పేసర్లకే దక్కిన రికార్డుండడంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం మూడు రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతితో ఎలా చెలరేగుతారన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. భారత్ ఈ టెస్టులో గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను నిలుపుకుంటుంది.

తుది జట్ల అంచనా

 భారత్ : జైస్వాల్, కెఎల్ రాహుల్, పడిక్కల్, గిల్(కెప్టెన్), పంత్, జురెల్, వాషింగ్టన్ సుందర్/జడేజా, అన్షుల్ కాంబోజ్/సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ/బ్రార్

న్యూజిలాండ్: లాథమ్(కెప్టెన్), కాన్వే, నికోల్స్,రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, జేమీసన్, హెన్రీ, డఫీ/ఫిషర్

మరిన్ని వార్తలు