ప్రణవి సరికొత్త చరిత్ర
- గోల్ఫ్‌లో స్వర్ణం కైవసం
- తొలి భారత గోల్ఫర్‌గా రికార్డు
- టీమ్ ఈవెంట్‌లో రజతం
గోల్ఫ్‌లో భారత్‌కు చెప్పుకోదగిన విజయాలు తక్కువే. అయితే ఈ సారి ఆసియా క్రీడల్లో(Asian Games) మాత్రం భారత మహిళా గోల్ఫర్లు చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో ప్రణవి అర్స్(Indian golfer Pranavi Urs) ఏకంగా పసిడి పతకాన్ని గెలిచింది. అలాగే టీం ఈవెంట్‌లో సైతం భారత్ రజతం సాధించింది. ఈ పోటీల్లో ప్రణవి అద్భుతంగా రాణించింది. 15-అండర్ 265 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని ముద్దాడింది.
చివరి రోజు ఆటలోకి మూడు స్ట్రోకుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ప్రణవికి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడో హోల్‌లో ట్రిపుల్ బోగీ నమోదు చేయడంతో రెండో స్థానానికి పడిపోయింది. అయితే, ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా అద్భుతం గా పుంజుకుంది. 6, 10, 13వ హోల్స్ మూడు కీలక బర్డీలు సాధించి తిరిగి ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. చివరి వరకు అదే జోరును కొనసాగించి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇదే ఈవెంట్లో పోటీపడిన ఇతర భారత క్రీడాకారిణులు ఆదితి అశోక్ 14వ స్థానంలో, దీక్షా దాగర్ 23వ స్థానంలో నిలిచారు. ఇక మహిళల జట్టు విభాగంలో ప్రణవి కీలక పాత్ర పోషించడంతో, భారత జట్టు 14-అండర్ 546 స్కోర్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల గోల్ఫ్ జట్టుకు ఇదే తొలి పతకం. మైసూరుకు చెందిన ప్రణవి అర్స్ ఆరేళ్లకే గోల్ఫ్ ఆడడం మొదలుపెట్టింది.
కేవలం 7 సంవత్సరాల వయసులోనే సౌత్ జోన్ టోర్నమెంట్ గెలుచుకుని తన ప్రతిభను చాటింది. జూనియర్ స్థాయిలో వేగంగా ఎదిగిన ప్రణవి 2018లో థాయ్‌లాండ్‌లో జరిగిన సింఘా వరల్ జూనియర్ ఛాంపియన్షిప్ తో పాటు ఆల్ ఇండియా జూనియర్ గరల్స్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది..చైనా, థాయ్లాండ్ దేశాల్లో జరిగిన ప్రతిష్టాత్మక ’క్వీన్ సిరికిట్ కప్’ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిచింది.
2020లో ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారిన ఆమె అదే సంవత్సరంలో హీరో విమెన్స్ ప్రో గోల్ఫ్ టూర్‌లో రెండు టైటిల్స్ సాధించింది..ఇండియన్ గోల్ఫ్ ప్రిఫర్డ్ లీగ్‌లో భాగంగా జరిగిన ఒక ఓపెన్-ఫీల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్‌లో పురుష గోల్ఫర్లను ఓడించి టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళగా సరికొత్త రికార్డు సృష్టించింది.