ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఆయుర్వేదమే ఆయుధం!
గిరిజన బాలికలకు ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యంపై అవగాహన
చివ్వెంల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని(International Ayurveda Day) పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, వీకే పహాడ్ ఆధ్వర్యంలో చివ్వెంలలోని గిరిజన బాలికల పాఠశాలలో ఆయుర్వేదంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఇందిరా వారణాసి విద్యార్థినులకు ఆయుర్వేద ప్రాముఖ్యత, నిత్యజీవితంలో దాని ఉపయోగం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార నియమాలు, ప్రకృతికి అనుగుణంగా జీవించే విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులతో ఆయుర్వేద వాక్ నిర్వహించారు.
యోగా శిక్షకుడు డి. ఉప్పలయ్య ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించి, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధానాలను వివరించారు. అనంతరం విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తగిన వైద్య, ఆరోగ్య సూచనలు అందించారు.
కార్యక్రమంలో డాక్టర్ ఇందిరా వారణాసి, ఫార్మసిస్ట్ ఏ. భూషణం, ఎస్‌ఎన్‌ఓ ఉపేంద్ర, యోగా ఇన్‌స్ట్రక్టర్ డి. ఉప్పలయ్యతో పాటు చివ్వెంల హోమియో డిస్పెన్సరీ డాక్టర్ విజయసారధి, ఫార్మసిస్ట్ పి. శోభ, నూతన్‌కల్ ఫార్మసిస్ట్ పి. శోభారాణి, రేణుక సబ్‌సెంటర్ సిబ్బంది, ఆశా వర్కర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
‘ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆయుర్వేదం’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడింది.