మద్యం ఏరులు.. మత్తులో గ్రామాలు!
- బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే ఆదేశాలకూ.. చుక్కెదురు?
- గ్రామాల్లో యథేచ్ఛగా మద్యం, గుడుంబా విక్రయాలు
- ఒక్కో క్వార్టర్, బీరుపై రూ.20 50 అదనపు వసూళ్లు
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
- అడ్డుకట్ట వేయాలంటున్న ప్రజలు
తుంగతుర్తి, నవంబర్ 26: తుంగతుర్తి నియోజకవర్గ(Tungaturti Constituency) పరిధిలోని 9 మండలాల, గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో గ్రామాలలో మధ్యం ఏరులై పారుతుండడంతో మందుబాబులు మత్తులో తూగుతున్నారు. అయితే మద్యానికి బానిసలైన వారి కుటుంబాలు చెదిరిపోతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్!
గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలని స్వయంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నూతనకల్, తుంగతుర్తి మండల సర్వసభ్య సమావేశాల్లో అధికారులను ఆదేశించి ఇప్పటికి నెల రోజులు గడుస్తున్న, క్షేత్ర స్థాయిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆదేశాలనే అధికారులు బేఖాతరు చేస్తున్నా రా? లేక బెల్ట్ షాపుల నిర్వాహకులకు అధికారుల అండదండలు ఉన్నాయా? అంటూ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గల్లీకో బెల్ట్ షాప్!
తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులే ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, ఇతర ప్రాంతాల నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే, ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అధికారుల తనిఖీలు కొరవడటంతో నిర్వాహకులు ,ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులే ఆరోపిస్తున్నారు. గ్రామా ల్లో ఎక్కడ చూసినా మద్యం సులభంగా అందుబాటులో ఉండటం వల్ల యువత, కూలీలు, సామాన్య కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, రోగాల బారిన పడి కుటుంబాలు, చల్లా చెదురవుతున్నాయని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో మద్యం బాటిల్ పై అదనపు వసూళ్లు?
బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యం బాటిళ్లపై ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క క్వార్టర్ బాటిల్, బీర్పై రూ.20 50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్వయాన మందుబాబులే చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ అదనపు భారం మరింత భారంగా మారుతోందని వాపోతున్నారు. ఎమ్మార్పీ ధరలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
జోరుగా గుడుంబా అమ్మకాలు...
మద్యం బెల్ట్ షాపుల వ్యవహారమే కాకుండా కొన్ని గ్రామాల్లో గుడుంబా విక్రయాలు కూడా జరుగుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడుంబా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికా రులు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పేద కుటుంబాలపై మద్యం ప్రభావం
గ్రామాల్లో మద్యం సులభంగా లభించడంతో రోజువారీ కూలీలు, నిరుపేద కుటుంబాల చెందిన కొందరు తమ సంపాదనలో అధిక భాగాన్ని మద్యానికే ఖర్చు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. మద్యం విక్రయాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టకపోతే గ్రామీణ కుటుంబాల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
కరువైన ఎక్సైజ్ శాఖాధికారుల తనిఖీలు!
మండలంలోని గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తే అక్రమ విక్రయాలు ఎలా కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం వెనుక కారణా లేమిటో వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాల వారీగా తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను గుర్తించి వాటిని కట్టడి చేయాలని కోరుతున్నారు.
గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలి
గ్రామాల్లో ప్రస్తుతం ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపుల దందా సాగుతున్నది. అధికారులు పూర్తిస్థాయిలో విఫలమ య్యారు. పర్యవేక్షణ కొరవైనది. గ్రామాల్లో మద్యంతో పాటు సారాయి కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి అధికారులు స్పందించి గ్రామాలలో బెల్ట్ షాపులను అరికట్టి అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కు పాదం మోపాలి.
మట్టిపెల్లి వెంకట్,
సామాజిక కార్యకర్త , తుంగతుర్తి