ప్రజా సమస్యలను గాలికి వదిలి బూతులతో కాలయాపన సిగ్గుచేటు
మోతె,(విజయక్రాంతి): ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బూతులతో దూషించుకుంటూ విలువైన సభా సమయాన్ని వృథా చేయడం సిగ్గుచేటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ(CPI(M) district secretary) సభ్యులు మట్టి పెల్లి సైదులు బుధవారం, ఒక ప్రకటనలో ఆరోపించారు. అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమని, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(BRS MLC Tata Madhu) చేసిన సంస్కారహీన వ్యాఖ్యలు కూడా ఖండనీయమని అన్నారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం వ్యాపారంగా మారడం, ఉద్యోగాల భర్తీ నామమాత్రంగా ఉండటం, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, కూలీలకు పని, కార్మికులకు కనీస వేతనాలు వంటి ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని అన్నారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేయాలని, లేనిపక్షంలో ప్రజలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని మట్టి పెల్లి సైదులు హెచ్చరించారు.