ఒక్కరే అధికారి.. అన్నీ తానై

30-09-2026 | 12:17pm

కోదాడ సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్(Municipality Town Planning) పట్టణ ప్రణాళిక విభాగం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా అటు ప్రజలకు సేవలు అందక ఇటు  ఉన్నతాధికారులు లేక విభాగం అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాలిటీలో కీలకమైన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ(Officer post vacant)గా ఉండటంతో పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. దీనికి తోడు కార్యాలయంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్లను వార్డు ఇన్చార్జిలుగా నియమించడంతో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పై పని భారం మోయలేని స్థాయికి చేరింది. 

అన్ని తానై... అల్లాడుతున్న టిపిబిఓ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒకే ఒక అధికారి టిపిబిఓ అన్ని పనులను చక్క పెట్టాల్సి వస్తోంది. ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఆయనే, విజిట్ చేసే ఆఫీసర్ ఆయనే కావడంతో విధుల నిర్వహణ భారంగా మారింది. కార్యాలయానికి వచ్చే బాధితులకు సమాధానం చెప్పాలన్న, అనుమతుల ఫైలు పరిశీలించాలన్న ఆయనే కావాల్సి వస్తోంది. సహాయక సిబ్బంది అసిస్టెంట్స్ ఎవరు లేకపోవడంతో  ప్రజా సమస్యల పరిష్కారానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. 

ఫోన్ మోగిన భయమే... అక్రమ కట్టడాల గోల! 

ఎక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్న.. ఎక్కడ క్రమబద్ధీకరణ సమస్యలున్న.. ప్రజలు నేరుగా ఆఫీసుకు లేదా చరవాణి మొబైల్ ద్వారానో టిపిబిఓ నే ఆశ్రయిస్తున్నారు. ఎటు చూసినా ఫిర్యాదులు, సమస్యలతో ఆఫీసర్ కార్యాలయం మార్మోగిపోతుంది. టి పి ఓ లేకపోవడంతో మరో పెద్ద సమస్యగా మారింది తీవ్రమైన ఒత్తిడి మధ్య ఎంతో కష్టంగా విధులు నిర్వహిస్తున్నాం అని సదరు అధికారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజల ఇబ్బందులు.. పట్టించుకోని ఉన్నతాధికారులు 

పట్టణంలో ఇళ్ల అనుమతులు, భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాల నిరోధానికి కీలకమైన ఈ విభాగంలో సిబ్బంది లేకపోవడంతో సామాన్య ప్రజలు కార్యాలయం  చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోదాడ మున్సిపాలిటీ పూర్తిస్థాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నీ నియమించాలని, అలాగే టౌన్ ప్లానింగ్ విభాగానికి అవసరమైన అసిస్టెంట్లను కంప్యూటర్ ఆపరేటర్లను కేటాయించి పని భారాన్ని తగ్గించాలని ప్రజలు బాధితులు కోరుతున్నారు

మరిన్ని వార్తలు