తుమ్మిడిహట్టికి సహకరించండి
- మహారాష్ట్రతో ఒప్పందానికి చొరవ చూపాలి
- పీఆర్‌ఎల్‌ఐఎస్, సీతారామకు పర్యావరణ అనుమతులివ్వాలి
- కృష్ణా జలాల టెలీమెట్రీలపై స్పందించండి
- కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి బరాజ్(Tummidihatti Barrage) నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని(Maharashtra Government) ఒప్పించి, త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను(C.R. Patil) సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కోరారు. బరాజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించామని వివరించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో(Uttam Kumar Reddy) కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యా రు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు(Telangana projects) సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించా రు.
తుమ్మిడిహట్టి బరాజ్‌ను ఎఫ్‌ఆర్‌ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మిం చేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చొరవ చూపాలని కోరారు. ఆ స్థాయిలో బరాజ్ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు వీలుంటుందని తెలిపారు. దాంతో నీటి తరలింపునకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం, విద్యుత్ వ్యయం తగ్గుతుందని సీఎం వివరించారు. అలాగే పాలమూరు--రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court verdict) ప్రకారం పర్యావరణ అనుమతులకు(Environmental permits) మార్గదర్శకాలను జారీ చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించిందని, త్వరగా స్పందించాలని సీఎం కోరారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతుందన్నారు. సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రం) పొందటానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు వివరించారు.
అలాగే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని, మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు రూ.4.15 కోట్లు ఇప్పటికే తెలంగాణ సర్కార్ జమ చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల) ఆదిత్యనాధ్ దాస్, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.