సింగరేణిపై కాంగ్రెస్ చిన్నచూపు
- సంస్థను నిర్వీర్వం చేసేలా ప్రభుత్వ విధానాలు
- కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): లక్షలాది కుటుంబాలకు జీవనా ధారంగా ఉన్న సింగరేణి సంస్థను(Singareni Institute) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) నిర్వీర్యం చేస్తుండటం, కార్మికుల హక్కులను(Workers rights), సంక్షేమాన్ని కాలరా స్తుండటం తీవ్ర ఆక్షేపణీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. ‘గత ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు(Singareni workers) కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది..’ అని మండిపడ్డారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. ‘సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన దసరా బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కార్మికులు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి సంస్థకు వేల కోట్ల రూపాయల లాభాలు తీసుకొస్తే, ఆ లాభాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. 2023- -24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నికర లాభం రూ. 4,701 కోట్లు. అందులో 33 శాతం అంటే రూ.1,551 కోట్లు.
కానీ కార్మికులకు చెల్లించింది కేవలం రూ.796 కోట్లు మాత్రమే. అంటే కార్మికులకు రావాల్సిన మొత్తంలో భారీగా కోత పెట్టారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినప్పటికీ, బోనస్ రూపంలో కార్మికులకు చెల్లించింది కేవలం రూ.819 కోట్లు మాత్రమే. బోనస్ శాతం ఒకటి ప్రకటించి, వాస్తవంగా మరో విధంగా చెల్లించడం ద్వారా కార్మికులను మోసం చేస్తున్నారనే ఆందోళన కార్మికుల్లో ఉంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 2023 నుంచి 2025 సంవత్సరాల వరకు సింగరేణి లాభాల బోనస్‌కు సంబంధించిన కార్మికుల బకాయిలు మొత్తం రూ.2,342 కోట్లు చెల్లించాలన్నారు.
సింగరేణి సంస్థ 2023 వరకు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, రూ.37వేల కోట్ల టర్నోవర్ సాధించి, దేశంలోనే అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి నిలిచిందని, అలాంటి సింగరేణి సంస్థకు ట్రాన్స్‌కో, జెన్‌కో నుంచి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జీతాల చెల్లింపుల కోసం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి వస్తుందని, కాబట్టి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణిలో కారుణ్య నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 16 వేల మందికి పైగా వారసత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. సింగరేణి సంస్థ వాటాలను విక్రయించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు.
డిమాండ్లు..
* వాస్తవ లాభాలపై సింగరేణి కార్మికులకు 36శాతం పైగా వాటా చెల్లించాలి.
* మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్న 2500 పైచిలుకు కార్మికులకు 3 నెలల మెడికల్ బోర్డుల చొప్పున పెట్టి అన్‌ఫిట్ చేసి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి.
* ఎన్నికల వాగ్దానాల ప్రకారం పెరక్స్‌పై ఇన్‌కమ్ టాక్స్‌ను కార్మికులకు తిరిగి చెల్లించాలి.
* సొంతింటి పథకం అమలు చేస్తూ కార్మికులకు 250 గజాల స్థలం, రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలి.
* మారు పేర్ల సమస్య పరిష్కరిస్తూ డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
* సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ. 60 వేల కోట్లు వెంటనే చెల్లించాలి
* సింగరేణి సంస్థలో వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలి.