కుమ్మరుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
నేరేడుచర్లలో కుమ్మరుల ఐక్య సమావేశం, నూతన కమిటీల ఎన్నిక
నేరేడుచర్ల (విజయక్రాంతి): కుమ్మర కులస్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కుమ్మర సంఘం నాయకులు కోరారు. నేరేడుచర్ల టౌన్ హాల్‌లో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల కుమ్మర కులస్థుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరులను బీసీ-బి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గంగమ్మ గుడి నుంచి టౌన్ హాల్ వరకు 200 మందికి పైగా కులస్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుమ్మర ప్రముఖుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.
తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా సిరికొండ ప్రేమ్ కుమార్(Sirikonda Prem Kumar), ప్రధాన కార్యదర్శిగా అల్వాల శ్రీధర్, పాలకవీడు మండల అధ్యక్షుడిగా టంగుటూరి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి రవీందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జి కొట్లం సంజీవరావు అధ్యక్షత వహించగా, జిల్లా నాయకులు మసంపల్లి సైదులు, టౌన్ కమిటీ అధ్యక్షులు నిమ్మన గోటి మల్లయ్య, సరికొప్పుల విజయలక్ష్మి నాగేశ్వర రావు, రాచకొండ అజయ్, మహేష్, పొరల కృష్ణ,కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.