కుక్కల స్వైరవిహారం..
- జంకుతున్న జనం!
- ‘గుంపులు గుంపులుగా సంచరిస్తున్న శునకాలు
- భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలు..
- వీధి కుక్కలకు యాంటీ రేబిస్ ఇంజక్షన్స్ ఇవ్వాలని వేడుకోలు
- శునకాల బెడద అరికట్టాలని విన్నపాలు
సూర్యాపేట రూరల్, అక్టోబర్ 30: సూర్యాపేట మండల పరిధిలో వీధి కుక్కల(Stray Dog) సంచారం రోజురోజుకూ హద్దులు దాటుతోంది. పట్టణ వీధులు, గ్రామీణ రోడ్లు అనే తేడా లేకుండా కుక్కల విచ్చలవిడిగా స్త్వ్రరవిహారం చేస్తున్నాయి అని దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు అని ఎప్పుడు ఏ వీధి నుండి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియక నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.మండల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 20 నుండి 25 కేసులు వస్తున్నట్టుగా యాంటీ రెబిస్ ఇంజెక్షన్స్,ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఎట్ బైట్ సైట్ వేస్తున్నట్టు స్థానికంగా అందిన సమాచారం.
బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
మండల పరిధిలోని పలు కాలనీలు, ప్రధాన కూడళ్లలో కుక్కల గుంపులు పగలు, రాత్రి తేడా లేకుండా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, ఉదయం నడకకు వెళ్లే వృద్ధులు, మహిళలపై ఈ మూగజీవాలు విరుచుకుపడుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారిని అడ్డగించి కరవడానికి వస్తుండటంతో కాలనీవాసులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెనుక కుక్కలు పడటంతో భయంతో వేగంగా వెళ్లబోయి ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వస్తుండటమే ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కేసులు పెరుగుతున్న.. చర్యలు కరువు
ఇప్పటికే మండల పరిధిలో ఎంతో మంది అమాయకులు, ముఖ్యంగా చిన్న పిల్లలు కుక్క కాటుకు గురి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడి ఆసుపత్రుల పాలవుతున్నా, స్థానిక మున్సిపల్, పంచాయతీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, కుక్క కాటు నివారణ (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) మీద అందరికి అవగాహనా సద్దస్సు లు,పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
రేబిస్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో కుక్క కాటును నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మండల వాసులను ఆందోళనచెందుస్తుంది. ఇటీవల హైదరాబాద్ శివారులో కుక్క కరిచినా తేలికగా తీసుకోవడంతో ’రేబిస్’ సోకి వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర కలవరం రేపింది. కుక్క కరిచిన వెంటనే స్పందించి వైద్యుల పర్యవేక్షణలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ పూర్తి కోర్సు తీసుకోకపోతే అది ప్రాణాంతకమైన ’రేబిస్’ వ్యాధికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుక్క లాలాజలంలోని వైరస్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణాలు హరిస్తుందని, కాబట్టి చిన్న గీరు పడ్డా సరే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఇకపై రూరల్ ప్రాంతాల్లోనూ దీనిపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
భారీ ప్రమాదాలు జరగకముందే స్పందించాలి
ఇటీవల కుక్కల దాడులు పెరుగుతున్న వాటి గురించి పట్టించుకునే నాథుడే లేడు అంటూ స్థానిక ప్రజలు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఏదైనా భారీ ప్రమాదం జరిగి, నష్టం జరిగిన తర్వాత స్పందిస్తారా? అని అధికారులను నిలదీస్తున్నారు.మండల పరిధిలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను వెంటనే పట్టుకోవాలి. కుక్కలకు సంతానోత్పత్తి నివారణ శస్త్రచికిత్సలు మరియు రేబిస్ నిరోధక టీకాలను యుద్ధప్రాతిపదికన అందించాలి.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కుక్క కాటు మందులను, వ్యాక్సిన్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి అని కుక్క కాటు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు, గ్రామాల్లో రేబిస్ వ్యాధి తీవ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు పాలకులు స్పందించి, సూర్యాపేట రూరల్ ప్రజలను ఈ కుక్కల భయం నుండి విముక్తులను చేయాలని, తగిన పరిష్కారం చూపించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
బయటికి వెళ్లాలంటే భయమైతుంది..
మా ఊరు టేకుమట్ల లో ప్రతి కాలనీ లో గుంపులు గుంపులు గా కుక్కలు వున్నాయి. బయటకు వెళ్లాలంటే భయం కలుగుతుంది. చిన్న పిల్లలు వృద్దులు అందరూ కూడా సాయంత్ర సమయాన ఆరు బయటనే వుంటారు. ఈ కుక్కల బెడదతో ఎపుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంగా వుంది...పై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
దుండిగల్ శివాజీ, ఉపసర్పంచ్, టేకుమట్ల
ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి
కుక్క కాటుకు గురి అయ్యిన వారు సాధ్యమైనంత త్వరగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రెబిస్ ఇంజక్షన్ చేసుకోవాలి. మీ నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.స్థానిక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రెబిస్ ఇంజక్షన్ లు, ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఎట్ బైట్ సైట్ లు అందుబాటులో వున్నాయి.
డాక్టర్ సిహెచ్ స్రవంతి, పీహెచ్సి మెడికల్ ఆఫీసర్